Hamas: బందీలలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు.. ఇజ్రాయెల్‌కు హమాస్ వార్నింగ్

Even one of the captives will not survives Hamas sensational warning to Israel
  • చర్చలు లేకుండానే ఇజ్రాయెల్ జైళ్లలోని పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టాలని హమాస్ డిమాండ్
  • యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటామని వెల్లడి
  • హమాస్ చెరలో ఇంకా 137 మంది బందీలుగా ఉన్నారన్న ఇజ్రాయెల్
తమ డిమాండ్లను నెరవేర్చకుంటే బందీలలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేరని ఇజ్రాయెల్‌కు పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ హెచ్చరిక జారీ చేసింది. బందీల-ఖైదీల మార్పిడి లేకుండా, చర్చలు చేపట్టకుండానే ఇజ్రాయెల్ జైళ్లలోని తమ ఖైదీలను ప్రాణాలతో విడిచిపెట్టాలని హమాస్ డిమాండ్ చేసింది. తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటూ హమాస్ సాయుధ విభాగం ప్రతినిధి అబూ ఒబెయిడా హెచ్చరించాడు. ఈ మేరకు ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇజ్రాయెల్‌ బలగాలతో తమ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ఒబెయిడా పేర్కొన్నాడు. అనాగరిక ఆక్రమణదారుడితో(ఇజ్రాయెల్) పోరాడడం తప్ప తమకు మరో మార్గం లేదని చెప్పాడు. తమ నుంచి ప్రతిఘటన లేకుండా చేయాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా నిర్దేశించుకుందని, కానీ తాము మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంటామని చెప్పాడు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల కోసం హమాస్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది.  

కాగా యుద్ధానికి విరామం ఇస్తూ వారంపాటు కొనసాగిన సంధి కాలంలో 240 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రతిగా 80 మంది ఇజ్రాయెల్‌, 105 మంది విదేశీ బందీలను హమాస్ విడుదల చేసింది. అయితే డిసెంబర్ 1న ఈ సంధి ముగిసింది. ఇంకా 137 మంది బందీలు హమాస్ చెరలో ఉన్నారని ఇజ్రాయెల్ ఈ శనివారమే ప్రకటించింది. మరో సంధి కోసం ప్రయత్నిస్తున్నట్టు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్ ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు. మరికొందరు బందీల విడుదల కోసం తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, అయితే ఇజ్రాయెల్ బాంబు దాడులతో సంధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. కాగా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదుల నరమేధంతో ఈ యుద్ధకాండ మొదలైంది. ఇరువైపులా కలుపుకొని ఇప్పటివరకు కనీసం 17,700 మంది మరణించి ఉంటారని అంచనాగా ఉంది.
Hamas
Israel
Hostages
Israel and Hamas war

More Telugu News