Jeevan Reddy: సమైక్యాంధ్ర పాలన కంటే కేసీఆర్ పాలన దారుణంగా సాగింది: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి

Jeevan Reddy lashes out at KCR government
  • విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షం
  • కేసీఆర్ పాలనలో రాష్ట్ర అప్పు రూ.6 లక్షల కోట్లకు దాటిందని విమర్శలు
  • కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి కేసీఆర్ బాధ్యుడని వ్యాఖ్య
మేడిగడ్డ ప్రాజెక్టు అక్రమాలపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు భావిస్తున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై వాస్తవాలను ప్రభుత్వం వెలికి తీయడంపై హర్షం వ్యక్తమవుతోందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాస్తవాలను ప్రజలకు తెలియ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం ఉన్నందున తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేయాలన్నారు. తుమ్మడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ల పాలన సమైక్యాంధ్ర పాలన కంటే దారుణంగా ఉందని విమర్శించారు.

రాష్ట్ర అప్పు రూ.6 లక్షల కోట్లకు దాటిందని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు, నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ చెప్పిందని, ఆ ప్రాజెక్ట్‌కు అనుమతి కూడా లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడిందని ఆరోపించారు.

ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్ని రకాల అవినీతికి కేసీఆరే బాధ్యుడన్నారు. ప్రాజెక్ట్‌కి సీడబ్ల్యూసీ అనుమతి కూడా లేదని కేంద్రం చెబుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంపై సోనియాగాంధీ పుట్టినరోజు నుంచి అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు.
Jeevan Reddy
Congress
Telangana Assembly Results

More Telugu News