Rajasthan: రాజస్థాన్ సీఎం ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠ.. ఢిల్లీకి వసుంధర రాజే

  • బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ఢిల్లీ చేరకున్న వసుంధర రాజే
  • కీలక చర్చలు జరపనున్నట్టు సమాచారం
  • మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వమంటూ అధిష్ఠానాన్ని కోరే అవకాశం
  • ఢిల్లీ వెళ్లడానికి ముందు 60 మందికిపైగా ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపిన మాజీ సీఎం
Suspense continues over the choice of Rajasthan CM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 5 రోజులు కావస్తోంది. బీజేపీ ఘన విజయం సాధించిన 3 రాష్ట్రాలలో రాజస్థాన్‌ ఒకటి. అయితే ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలలేదు. మాజీ సీఎం వసుంధర రాజేతోపాటు కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ మేఘ్వాల్, ఆ పార్టీ ఎంపీలు బాబా బాలక్‌నాథ్, దియా కుమారి కూడా సీఎం పదవిని ఆశిస్తుండడం హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. ఎడతెగని అనిశ్చితి కొనసాగుతున్న వేళ మాజీ సీఎం వసుంధర రాజే బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మరోసారి సీఎం పదవిని ఆశిస్తున్న ఆమె అధిష్ఠానంతో గురువారం ఉదయం చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ఆమె అపాయింట్‌మెంట్ కోరారని, గురువారం ఉదయం చర్చించనున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

సోమ, మంగళవారాల్లో రాజస్థాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్తగా ఎన్నికైన 60 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలతో వసుంధర రాజే సమావేశమయ్యారు. మర్యాదపూర్వక సమావేశమని చెబుతున్నప్పటికీ వసుంధర రాజేకు ఎమ్మెల్యేలు మద్ధతు ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం ఆమె ఢిల్లీ బయలుదేరడంతో ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. కాగా వసుంధర రాజే 2003 -2008 బీజేపీ జాతీయాధ్యక్షురాలిగా, 2013 -2018 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాగా ఇటీవలే వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మోగింది. మొత్తం 199 స్థానాలకు పోలింగ్ జరగగా బీజేపీ 163, కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకున్నాయి.

More Telugu News