Congress: హోటల్ ఎల్లాకు చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ!

  • తెలంగాణ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన కాంగ్రెస్
  • కాసేపట్లో సీఎల్పీ సమావేశం
  • సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించనున్న పార్టీ ఎన్నికల పరిశీలకులు
Telangana Congress CM candidate selection today

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ను మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ క్రమంలో, హైకమాండ్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ లోని ఎల్లా హోటల్ కు చేరుకున్నారు. కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం అభ్యర్థిని ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారు. పార్టీ ఎన్నికల పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఆ తర్వాత ఆ అభ్యర్థికి హైకమాండ్ ఆమోదముద్ర వేస్తుంది. ఆ వ్యక్తి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. 

ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. రేసులో మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలలోపు సీఎం క్యాండిడేట్ ఎవరనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు గవర్నర్ తమిళిసైని కలిశారు. మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు తమకు ఉన్నారని... ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని గవర్నర్ ను కోరారు.

More Telugu News