Bandi Sanjay: ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందింది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

BJP Leader Bandi Sanjay Sensational Comments On Congress
  • కాంగ్రెస్‌కు, రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్
  • ఏది ఏమైనా కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్న బీజేపీ నేత
  • కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామని వాఖ్య
  • ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి లాభపడాలని బీఆర్ఎస్ చివరికి ఓటమి పాలైందన్న కరీంనగర్ ఎంపీ
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల అనంతరం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల పక్షాన బీజేపీ పోరాడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఓడించాలన్న లక్ష్యంతో ముస్లింల ఇళ్లను కూల్చినోళ్లకు, వక్ఫ్ ఆస్తులను కబ్జా చేసినోళ్లకే ముస్లింలు ఓటు వేయడం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. 

ఏది ఏమైనా కేసీఆర్  మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గోసపడుతున్న ప్రజలను చైతన్యం చేసింది బీజేపీ అని, కానీ అంతిమంగా కాంగ్రెస్ ఆ లబ్ధి పొందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలిచిన తమపై కేసులు పెట్టారని, జైలుకు కూడా పంపారని గుర్తు చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు తమను ఆదరించలేదని, అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందన్నారు. 

గెలుపోటముల ఆధారంగా తాను పనిచేయనని, తన లక్ష్యం తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు తాను, రేవంత్‌రెడ్డి లక్ష్యంగా మారామన్నారు. బీజేపీ కోసం కష్టపడి పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రూ. 200 కోట్లు ఖర్చు చేసి తిరిగి తాను డబ్బులు పంచుతున్నానని అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కుట్ర చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లాభపడాలని చూసిన బీఆర్ఎస్ చివరికి ఓటమి మూటగట్టుకుందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay
Karimnagar
BJP
Congress
Revanth Reddy
KCR

More Telugu News