Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి?.. నేడు ప్రమాణ స్వీకారం!

  • ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం
  • అనంతరం అధిష్ఠానానికి సీఎల్పీ తీర్మానం
  • ప్రస్తుత అసెంబ్లీ రద్దు అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
  • కార్యక్రమానికి రాహుల్, ప్రియాంక, ఖర్గే
Revanth Reddy Oath taking today as Telangana New CM

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఉదయం కాంగ్రెస్ శాసన సభాపక్షం సమావేశం అవుతుంది. అనంతరం అధిష్ఠానంతో సంప్రదించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది గవర్నర్‌కు తెలియజేస్తారు. అయితే, పార్టీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క సహా పలువురు నేతలు సీఎం రేసులో ఉన్న నేపథ్యంలో సీఎల్పీ భేటీ తర్వాతనే సీఎం అభ్యర్థి పేరును ఖరారు చేస్తారని తెలుస్తోంది. నిజానికి గత రాత్రే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ ఉదయం 9.30 గంటలకు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. 

సీఎల్పీ తీర్మానాన్ని అధిష్ఠానానికి పంపి.. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌కు తెలియజేస్తారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను నేడు గవర్నర్‌కు ఈసీ అందిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ రద్దు చేసిన అనంతరం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరయ్యే అవకాశం ఉంది.

More Telugu News