Pawan Kalyan: వారు కోరుకునేది కాసింత ప్రోత్సాహం, ఆర్థిక చేయూత: పవన్ కల్యాణ్

Pawan Kalyan responds on International Day of Persons with Disabilities
  • నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
  • ప్రోత్సహిస్తే దివ్యాంగులు కూడా చక్కగా రాణిస్తారన్న పవన్
  • దివ్యాంగుల అంశాలను పాలకులు  ప్రాధాన్య విషయాలుగా తీసుకోవాలని హితవు
  • ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక చేయూతనందిస్తామని హామీ
నేడు (డిసెంబరు 3) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగుల శక్తిసామర్థ్యాలను, వారి ప్రతిభా పాటవాలను గుర్తించి ప్రోత్సహించగలిగితే చాలు... చక్కగా రాణిస్తారని అభిప్రాయపడ్డారు. దివ్యాంగుల అభివృద్ధిని, వారి సంక్షేమాన్ని జనసేన ఎన్నటికీ విస్మరించదని స్పష్టం చేశారు. విద్య, ఉపాధి కల్పనలో వారిని కచ్చితంగా ముందుకు తీసుకువెళతామని పవన్ కల్యాణ్ తెలిపారు. 

"జనవాణి కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో నా ముందుకు ఎంతోమంది దివ్యాంగులు వచ్చారు. తమ సమస్యలను, ఆవేదనను వెలిబుచ్చారు. వారు కోరుకునేది కాసింత ప్రోత్సాహం, ఆర్థికపరమైన చేయూత. కానీ ఈ విషయాలను పాలకులు తమ ప్రాధాన్య అంశాలుగా తీసుకోవడంలేదు. దివ్యాంగుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. 

దివ్యాంగుల విషయంలో కూడా రాజకీయాలు చొప్పించి ఇబ్బందులు పెట్టిన దాఖలాలు నా దృష్టికి వచ్చాయి. తమ పక్షం కాని వారి పింఛన్ల మంజూరులోనూ ఇక్కట్ల పాల్జేస్తున్నారు. కచ్చితంగా రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో దివ్యాంగులు, అంధులు, విభిన్న ప్రతిభావంతులకు చేయూతను అందిస్తాం. వారికి ధృవపత్రాల జారీని సరళీకరించడంతో పాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూస్తాం" అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Pawan Kalyan
Disabled Persons
International Day of Persons with Disabilities
Janasena
Andhra Pradesh

More Telugu News