Nagarjuna Sagar: నాగార్జున సాగర్ వివాదం: రేపు అత్యవసర భేటీ ఏర్పాటు చేసిన కేంద్రం

Union govt will held key meeting on projects
  • నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య వివాదం
  • వివిధ ప్రాజెక్టులపై వివాదాల పరిష్కారానికి సిద్ధమైన కేంద్రం
  • రేపు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం 
  • హాజరు కావాలంటూ ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచన

నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో, వివిధ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం సిద్ధమైంది. నాగార్జునసాగర్, శ్రీశైలం డ్యాముల నిర్వహణను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. 

ఈ క్రమంలో కేంద్ర జలశక్తి శాఖ రేపు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ సీఎస్ లకు సూచించింది. సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డీజీలు, సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లకు కూడా దీనిపై సమాచారం అందించింది. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ చైర్మన్లు ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. 

కాగా, ఇవాళ కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతను సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు సాగర్ డ్యామ్ వద్దకు చేరుకున్నాయి. సాగర్ డ్యామ్ ను తమ అధీనంలోకి తీసుకోనున్నాయి. 

ప్రస్తుతం ఉద్రిక్తతల నేపథ్యంలో సాగర్ డ్యామ్ కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు మోహరించి ఉన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాలు పోలీసుల వలయంలో ఉన్నాయి.

  • Loading...

More Telugu News