Congress: తెలంగాణ కాంగ్రెస్ గెలుపు గుర్రాలను బెంగళూరు తరలించే అవకాశం...?

  • తెలంగాణలో నిన్న పోలింగ్
  • డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు
  • సంకీర్ణం వస్తే అందుకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రణాళిక!
  • గెలిచే అవకాశాలున్న అభ్యర్థులను కాపాడుకోవాలని భావిస్తున్న అధిష్ఠానం!
Telangana Congress reportedly may shift its candidates to Bengaluru

తెలంగాణ అధికార పీఠాన్ని కైవసం చేసుకునే పార్టీ ఏదనేది మరో రెండ్రోజుల్లో తేలనుంది. నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా, డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.  ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపుపై మొదటి నుంచి ధీమాగా ఉన్న కాంగ్రెస్ పార్టీ... ఒకవేళ సంకీర్ణం వస్తే తన ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలన్న దానిపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. 

నిన్నటి ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కే మొగ్గు కనిపించినప్పటికీ, బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా సీట్లు గెలిచే అవకాశాలున్నట్టు కొన్ని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడైంది. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోతే... పార్టీ ఫిరాయింపుదారులే కీలకం అవుతారు. అందుకే, గెలిచే అవకాశాలున్న ఏ అభ్యర్థిని కూడా ఇతర పార్టీలోకి వెళ్లకుండా చూసేందుకు వీలుగా... కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపినట్టు సమాచారం. 

ఇందులో భాగంగానే తమ గెలుపు గుర్రాలను బెంగళూరు తరలించి, వారిని కొన్నిరోజుల పాటు కాపాడుకోవాలన్నది కాంగ్రెస్ ప్రణాళిక అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కొందరు అభ్యర్థులు ఏ క్షణమైనా బెంగళూరు తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ హైకమాండ్ నుంచి సంకేతాలు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రత్యేక విమానాలను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. 

ఒకవేళ కాంగ్రెస్ గనుక 70 సీట్ల కంటే తక్కువ గెలుచుకుంటే, తమ అభ్యర్థులను కచ్చితంగా బెంగళూరుకు తరలించే అవకాశాలు ఉన్నట్టు ఓ సీనియర్ నేత తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు ఉండగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 60. చాలా ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే... కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు పైన కొన్ని సీట్లు గెలిచే అవకాశమున్నట్టు తెలిపాయి. అందుకే, కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ఇద్దరు సమన్వయకర్తలను రాష్ట్రానికి పంపినట్టు తెలుస్తోంది. గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులను గుర్తించి, వారు గెలుపు సర్టిఫికెట్లు అందుకున్న వెంటనే వారిని అజ్ఞాత ప్రదేశానికి తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాలు తెలిపాయి.

More Telugu News