Telangana Assembly Election: హైదరాబాదీలు.. దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి!: అధికారులు, ప్రముఖుల విజ్ఞప్తి

Poling officers urged Hyderabadies to vote in election
  • తెలంగాణ వ్యాప్తంగా నమోదైన ఓటింగ్ శాతంతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువ
  • మొదటి మూడు గంటల్లో అయితే కేవలం 5 శాతమే పోలింగ్
  • పది గంటల వరకు నాంపల్లిలో అత్యల్పంగా 0.5 శాతమే పోలింగ్
తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల పోలింగ్ చాలా తక్కువగా నమోదవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓటర్లు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లేందుకు బద్దకిస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది. కానీ హైదరాబాద్‌లో మాత్రం చాలా తక్కువగా ఉంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి మూడు గంటల్లో అంటే పది గంటల వరకు హైదరాబాద్‌లో నమోదైన పోలింగ్ కేవలం 5 శాతం. రాజధాని నగరంతో పోల్చుకుంటే గ్రామీణ తెలంగాణలో పోలింగ్ ఎక్కువగానే ఉంది.

ఉదయం పది గంటల వరకు నాంపల్లిలో అత్యల్పంగా 0.5 శాతం, సనత్ నగర్‌లో 1.2 శాతం, కూకట్‌పల్లిలో 1.9 శాతం, మేడ్చల్‌లో 2 శాతం, గోషామహల్‌లో 2 శాతం, చార్మినార్‌లో 3 శాతం, ముషీరాబాద్‌లో 4 శాతం, రాజేంద్రనగర్‌లో 15 శాం పోలింగ్ నమోదయింది.

హైదరాబాదీలు... దయచేసి బయటకు వచ్చి ఓటు వేయండి.. మీకు పోలింగ్ రోజున సెలవు ప్రకటించింది... ఓటు వేయడం కోసమేనని గుర్తుంచుకోండి అని అధికారులు విజ్ఞప్తులు చేస్తున్నారు. చిరంజీవి, సాయిధరమ్ తేజ్, సుమ కనకాల, అల్లు అర్జున్ వంటి ప్రముఖులు ఓటు వేసి, ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ శాతంతో పోలిస్తే హైదరాబాద్‌లో చాలా తక్కువగా ఉంటోంది.

ప్రతి ఎన్నికల్లోనూ హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎప్పుడు కూడా 54 శాతం ఓటింగ్ మించలేదు. దీంతో ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రతిచోట ఓటు హక్కు విలువను తెలియజేస్తూ ప్రచారాలు నిర్వహించారు.
Telangana Assembly Election
Hyderabad
BJP
BRS

More Telugu News