TDP Worker Murder: టీడీపీ కార్యకర్త హత్య కేసు.. 9 మందికి యావజ్జీవ కారాగారశిక్ష

  • 2006లో ముళ్లపాడులో నరసింహయ్య హత్య
  • వినాయక విగ్రహం ఊరేగింపు సమయంలో కాంగ్రెస్ వర్గీయుల దాడి
  • నేరం రుజువు కావడంతో యావజ్జీవ కారాగారశిక్షను విధించిన జడ్జి
Court sentenced life imprisonment to 9 persons in TDP worker murder case

2006లో టీడీపీ కార్యకర్త నరసింహయ్య (80)పై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో తొమ్మిది మందికి నందిగామ 16వ అదనపు న్యాయమూర్తి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడులో ఈ హత్య జరిగింది. 2006 సెప్టెంబర్ లో వినాయక విగ్రహం ఊరేగింపు సమయంలో కాంగ్రెస్ వర్గీయులు నరసింహయ్యపై రాళ్లతో దాడి చేశారు. 

ఈ కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో గతంలో ట్రయల్ నడించింది. ఆ తర్వాత నందిగామలో జిల్లా అదనపు న్యాయమూర్తి కోర్టు రావడంతో కేసును ఈ కోర్టుకు బదిలీ చేశారు. గతంలో ఈ కేసుపై స్టే విధించిన హైకోర్టు... ఆ తర్వాత స్టేను ఎత్తివేసింది. ఈ క్రమంలో ఇరువైపు వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. నేరం రుజువు కావడంతో తుది తీర్పును ఇచ్చారు. యావజ్జీవ కారాగారశిక్ష పడినవారిలో పగడాల సుబ్బారావు, యండ్రాతి శ్రీనివాసరావు, నెల్లూరి నరసింహారావు, యండ్రాతి పూర్ణచంద్రరావు, రమణ, గూడపాటి పుల్లయ్య, ఈవూరి వసంతరెడ్డి, హనుమయ్య, గుత్తా నారాయణరావు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా వైసీపీలో కొనసాగుతున్నారు.

More Telugu News