Glenn Maxwell: వెళుతూ వెళుతూ సంచలన ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్ వెల్... టీమిండియాకు ఓటమి

Maxwell sensational innings gives Aussies first victory in the series
  • వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై విధ్వంసక సెంచరీ చేసిన మ్యాక్సీ
  • నేడు టీమిండియాపై అదే స్థాయిలో విజృంభణ
  • 48 బంతుల్లోనే 104 పరుగులు
  • 8 ఫోర్లు, 8 సిక్సులు బాదిన ఆల్ రౌండర్
  • 5 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్... సిరీస్ ఆశలు సజీవం

ఇటీవల వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ పై సంచలన ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తాజాగా టీమిండియాతో 3వ టీ20 మ్యాచ్ లోనూ తన బ్యాట్ పవర్ రుచిచూపించాడు. మరోసారి మ్యాక్స్ వెల్ సంచలన సెంచరీతో మెరిసిన వేళ ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. 

టీమిండియా నిర్దేశించిన 223 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మ్యాక్స్ వెల్ కేవలం 48 బంతుల్లోనే 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ హార్డ్ హిట్టింగ్ బ్యాటర్ 8 ఫోర్లు, 8 సిక్సులు బాదడం విశేషం. 

చివరి ఓవర్లో ఆసీస్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా... ప్రసిద్ధ్ కృష్ణ విసిరిన ఆ ఓవర్లో మ్యాక్స్ వెల్ 1 సిక్స్, 3 ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో మ్యాక్స్ వెల్ సెంచరీ పూర్తవడమే కాదు, చివరి బంతితో ఆసీస్ విజయం ఖరారైంది. 

మ్యాక్స్ వెల్ కు ఇది 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కాగా, అందులో సెంచరీ చేయడం ద్వారా ఈ మ్యాచ్ ను మ్యాక్స్ వెల్ చిరస్మరణీయం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మ్యాక్స్ వెల్ కు ఇది నాలుగో సెంచరీ. ఆసీస్ ఇన్నింగ్స్ లో ట్రావిస్ హెడ్ 35, ఆరోన్ హార్డీ 16, జోష్ ఇంగ్లిస్ 10 పరుగులు, స్టొయినిస్ 17 పరుగులు చేశారు. ఫామ్ లో లేని టిమ్ డేవిడ్ (0) డకౌట్ అయ్యాడు. చివర్లో మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్) కూడా బ్యాట్ ఝళిపించడంతో ఆసీస్ విజయం సాధ్యమైంది. 

ఈ విజయంతో సిరీస్ లో ఆసీస్ ఆశలు సజీవంగా నిలిచాయి. ప్రస్తుతం ఈ 5 మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. 

ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ డిసెంబరు 1న రాయ్ పూర్ లో జరగనుంది. డిసెంబరు 3న హైదరాబాదులో చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ రెండు మ్యాచ్ లకు గ్లెన్ మ్యాక్స్ వెల్, జోష్ ఇంగ్లిస్ అందుబాటులో ఉండడంలేదు. వారు రేపు ఆస్ట్రేలియా పయనమవుతున్నారు.

  • Loading...

More Telugu News