Zimbabwe: విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా

Zimbabwe player Sikandar Raza equaled Virat Kohlis record
  • 2023లో కోహ్లీతో సమానంగా ఆరు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న రజా
  • రువాండాపై అద్భుత హ్యాట్రిక్, హాఫ్ సెంచరీతో రికార్డు సమం చేసిన ఆల్ రౌండర్
  • మరిన్ని మ్యాచ్‌లు ఆడనుండడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్!
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న జింబాబ్వే ఆల్-రౌండర్ సికందర్ రజా క్యాలెండర్ ఏడాది 2023లో అత్యధికంగా కింగ్ విరాట్ కోహ్లీతో సమానంగా ఆరు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ‘ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా రీజియన్ క్వాలిఫైయర్ 2023’లో భాగంగా రువాండాపై చెలరేగడంతో రజా ఈ రికార్డును సమం చేశాడు. రువాండాపై రజా సంచలన హ్యాట్రిక్ నమోదు చేయడంతోపాటు హాఫ్ సెంచరీ కొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. దీంతో 2023లో ఆరు అవార్డులు అందుకున్న ఆటగాడిగా రజా నిలిచాడు. క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా జింబాబ్వే మరో రెండు మ్యాచ్‌లు ఆడనుండడంతో పాటు వచ్చే నెలలో స్వదేశంలో ఐర్లాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో దిగ్గజ ఆటగాడు కోహ్లీ రికార్డును రజా బద్దలు కొట్టే అవకాశం ఉంది.

కాగా 2024 టీ20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రువాండాపై జింబాబ్వే గెలిచింది. నమీబియా, ఉగాండాపై షాకింగ్ పరాజయాల తర్వాత ఆదివారం ఈ విజయాన్ని అందుకుంది. ఏకంగా 144 పరుగుల తేడాతో గెలుపుని నమోదు చేసింది. ఈ మ్యాచ్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 215 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఓపెనర్లుగా వచ్చిన మారుమణి(50), రజా(58), ర్యాన్ బర్ల్ (44) కీలక ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం జింబాబ్వే బౌలర్లు రాణించడంతో రువాండా 71 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో సికందర్ రజా 19వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ని నమోదు చేశాడు.


Zimbabwe
Sikandar Raza
Virat Kohli
Cricket
ICC
T20 World Cup

More Telugu News