Adudam Andhra: 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో ఏపీలో క్రీడా పోటీలు... నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

AP govt will conduct sports events state wide
  • ఏపీలో క్రీడా సంరంభం
  • 15 ఏళ్లకు పైబడిన వారు అర్హులు
  • డిసెంబరు 13 వరకు రిజిస్ట్రేషన్లు
  • డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు పోటీలు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో క్రీడా సంరంభానికి తెరలేపింది. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో భారీ ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించేందుకు జగన్ సర్కారు సన్నద్ధమైంది. వివిధ క్రీడాంశాల్లో జరిగే ఈ పోటీలకు నేడు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన 15 ఏళ్లకు పైబడిన వారు తమ వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. 

రిజిస్ట్రేషన్లకు చివరి గడువు డిసెంబరు 13. వాలంటీర్ల ద్వారా కానీ, https://aadudamandhra.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా కానీ, 1902 ఫోన్ నెంబరు ద్వారా కానీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ క్రీడలు డిసెంబరు 15 నుంచి ఫిబ్రవరి 3 వరకు జరుగుతాయి. 

కాగా, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు అంబటి రాయుడు (క్రికెట్), ఎమ్మెస్కే ప్రసాద్ (క్రికెట్), శ్రీకర్ భరత్ (క్రికెట్), పీవీ సింధు (బ్యాడ్మింటన్), ద్రోణవల్లి హారిక (చెస్), పెంటేల హరికృష్ణ (చెస్), కరణం మల్లీశ్వరి (వెయిట్ లిఫ్టింగ్), చేతన్ ఆనంద్ (బ్యాడ్మింటన్), కోనేరు హంపి (చెస్), భరత్ అరుణ్ (క్రికెట్), ఎతిమరపు రజని (హాకీ), సాకేత్ మైనేని (టెన్నిస్), హనుమ విహారి (క్రికెట్), కిదాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్), సంతోషి మత్స (వెయిట్ లిఫ్టింగ్), సాత్విక్ సాయిరాజ్ (బ్యాడ్మింటన్), లలిత్ బాబు (చెస్), ఉష నాగిశెట్టి (బాక్సింగ్), యెజ్జు సుబ్బారావు (వాలీబాల్), వై.వేణుగోపాలరావు (క్రికెట్), బి.ప్రత్యూష (చెస్), వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ) బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. 

ఈ క్రీడాపోటీలకు మొత్తం రూ.12 కోట్ల ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈ మేరకు 'ఆడుదాం ఆంధ్రా' వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులే కాదు, పోటీలను వీక్షించే ప్రేక్షకులు కూడా రిజిస్టర్ చేసుకునేందుకు వెబ్ సైట్లో అవకాశం కల్పించారు.
Adudam Andhra
Sports
Events
YSRCP
Andhra Pradesh

More Telugu News