KTR: కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలి?: మంత్రి కేటీఆర్

  • కేసీఆర్ మూడోసారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకువస్తామని హామీ
  • కాంగ్రెస్ గెలవకముందే రైతుల నోట్లో మట్టికొట్టిందని ఆగ్రహం
  • అభివృద్ధితో దూసుకెళ్తున్న తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టవద్దన్న కేటీఆర్
Minister KTR fires at Congress over rythu bandhu issue

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం తప్పు చేశారని ఇంటికి పంపించాలి? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ధర్మపురి, పెద్దపల్లి నియోజకవర్గాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఎవరికీ న్యాయం జరగదన్నారు. కేసీఆర్ మూడోసారి గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకువస్తామన్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే రైతుబంధును నిలిపివేయించిందని, తద్వారా రైతుల నోట్లో మట్టి కొట్టిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి పదకొండుసార్లు అధికారం ఇస్తే ఏం చేసింది? అని నిలదీశారు. ధరణిని రద్దు చేసి పట్వారీ వ్యవస్థను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్ కొత్తదేమీ కాదని, అదో చెత్త పార్టీ అన్నారు. ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు అడుగుతున్నారని, కానీ పదకొండుసార్లు అధికారంలో ఉండి కనీసం తాగునీరు, సాగునీరు, కరెంట్, పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు. సంక్షేమం కాకుండా ప్రజల జీవితాలను ఆగం చేశారన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వందలాది మంది విద్యార్థుల ప్రాణాలు తీసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.

కేసీఆర్ ఏం చేశారు? అని కాంగ్రెస్ అడుగుతోందని, రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, రూ.2వేల పెన్షన్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాలను తీసుకు వచ్చింది ఆయనే అన్నారు. రైతును బాగు చేసిన కేసీఆర్‌ను కాదని ఆరు దశాబ్దాలు మనల్ని ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్‌ను తీసుకువద్దామా? అని ప్రశ్నించారు. కేసీఆర్ గొంతు పిసికేస్తే తెలంగాణ గురించి అడిగేవాళ్లు ఉండరనే ఉద్దేశ్యంతో ఢిల్లీ నుంచి అగ్రనాయకులు రాష్ట్రంపై దండెత్తుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధితో దూసుకు వెళ్తున్న తెలంగాణను ఢిల్లీ చేతుల్లో పెట్టవద్దని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News