KTR: గోషామహల్, కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థుల్ని నిలబెట్టింది: కేటీఆర్

Minister KTR says BRS will win Goshamahal this time
  • గోషామహల్‌లో బీజేపీని ఓడిస్తామన్న కేటీఆర్
  • రైతుబంధు పాత పథకమే కాబట్టి ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టీకరణ
  • రాహుల్ గాంధీ 2014 నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నారని విమర్శ
గోషామహల్, కరీంనగర్, కోరుట్ల నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గోషామహల్‌లో ఈసారి బీజేపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రైతుబంధు కింద అందే సాయంపై విమర్శలు చేస్తున్నారని, కానీ అది కొత్త పథకం కాదని గుర్తించాలన్నారు. ఇప్పటికే ఉన్న పథకాలకు ఎన్నికల కోడ్ వర్తించదని స్పష్టం చేశారు. కేసీఆర్ దీక్ష వల్లే కేంద్రం దిగి వచ్చి తెలంగాణపై ప్రకటన చేసిందని తెలిపారు.

నవంబర్ 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఆ రోజు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడి వారు అక్కడే దీక్షా దీవస్‌ను ఘనంగా నిర్వహించాలన్నారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని సూచించారు. ఐటీ దాడులు కేవలం కాంగ్రెస్ అభ్యర్థుల పైన మాత్రమే జరుగుతున్నాయని చెప్పడం సరికాదన్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పటికే అస్త్ర సన్యాసం చేశారన్నారు. తెలంగాణకు స్వీయపాలన శ్రీరామ రక్ష అన్నారు.

రాహుల్ గాంధీ రాజకీయ నిరుద్యోగిగా మారిపోయారని, 2014 నుంచి ఆయనకు ఉద్యోగం లేదని ఎద్దేవా చేశారు. ఈ పదేళ్లలో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం లేదని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ఏడాదిలోపు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదన్నారు.
KTR
Telangana Assembly Election
BRS
Congress

More Telugu News