Hyderabad: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం: యూపీ సీఎం యోగి

Hyderabad will be renamed if BJP comes to power in Telangana says UP CM Yogi
  • డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్న యోగి ఆధిత్యనాథ్
  • హిందూ ధర్మం కోసం పోరాడే రాజాసింగ్‌ను గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థన
  • శనివారం గోషామహల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అగ్రనేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ కూడా పాల్గొన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు మద్దతుగా శనివారం ఆయన ప్రచారం నిర్వహించారు. బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరం పేరుని ‘భాగ్యనగరం’గా మార్చుతామని హామీ ఇచ్చారు. గోషామహల్‌లో హిందూ ధర్మం కోసం పోరాడే వ్యక్తి రాజాసింగ్‌ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాజాసింగ్‌ను గెలిపించి అయోధ్య భవ్య రామ మందిరాన్ని దర్శించుకోవాలని అన్నారు.

రాష్ట్ర ప్రజానీకం కమలం గుర్తుకి ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్తుందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని మండిపడ్డారు. ఈ మేరకు బేగంబజార్ చౌరస్తాలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయని, కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక అవినీతిని రూపుమాపారని అన్నారు.

కాగా హైదరాబాద్‌లో బీజేపీ శనివారం నిర్వహించిన పలు ప్రచార కార్యక్రమాల్లో యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. మంగళ్ హట్‌లో ఆకాశపురి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు రోడ్ షో నిర్వహించారు. జుమ్మెరాత్ బజార్ చౌరస్తా వద్ద రోడ్డుకు ఇరువైపులా 6 బుల్డోజర్లను ఏర్పాటు చేసి సీఎం యోగి, బీజేపీ గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్‌లపై పూల వర్షం కురిపించారు.
Hyderabad
BJP
Telangana
Yogi Adityanath
Telangana Assembly Election

More Telugu News