Soumya Vishwanathan: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

Delhi Saketh Court sentenced four persons life prisonment in Journalist Soumya Vishwanathan murder
  • 2008లో ఢిల్లీలో జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య
  • కారులో వస్తుండగా అడ్డగించి, కాల్చి చంపిన వ్యక్తులు
  • తీర్పు వెలువరించిన ఢిల్లీ సాకేత్ కోర్టు
  • దోపిడీ కోసమే ఆమెను చంపారని దర్యాప్తులో వెల్లడి

మహిళా జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీలోని సాకేత్ కోర్టు నలుగురికి జీవితఖైదు విధించింది. మరో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2008లో ఢిల్లీలోని వసంత్ కుంజ్ వద్ద ఈ హత్య జరిగింది. 

ఓ టీవీ చానల్లో పాత్రికేయురాలిగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, దారిలో ఆమెను అటకాయించిన వ్యక్తులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలతో ఆమె కారులోనే ప్రాణాలు విడిచారు. 

ఈ కేసులో రవి కపూర్, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అమిత్ శుక్లా లపై హత్యా అభియోగాలను మోపిన ప్రాసిక్యూషన్ విభాగం ఆ అభియోగాలను నిరూపించడంలో సఫలమైంది. 

అజయ్ సేథీ అనే వ్యక్తిని ఐదో నిందితుడిగా పేర్కొన్నారు. సౌమ్య విశ్వనాథన్ వాహనాన్ని అజయ్ సేథీ అడ్డగించాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. 411 సెక్షన్ కింద అతడు దోషిగా నిరూపణ అయ్యాడు. కాగా నిందితులు ఆమెను దోపిడీ కోసమే హత్య చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది.

కాగా, ఢిల్లీ కోర్టు తీర్పుపై సౌమ్య విశ్వనాథన్ తల్లి స్పందించారు. తీర్పు సంతృప్తి కలిగించిందే తప్ప, సంతోషం కలిగించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News