Ambati Rayudu: జగన్ తన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చారు: క్రికెటర్ అంబటి రాయుడు

  • అనంతపురం విచ్చేసిన అంబటి రాయుడు
  • రాజకీయాల్లోకి వచ్చే అంశంపై ఇంకా నిర్ణయించుకోలేదని వెల్లడి
  • జగన్ మరెన్నో మంచి పనులు చేస్తారని వ్యాఖ్యలు
Ambati Rayudu heaps praise on CM Jagan

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఇటీవల రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారారు. రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడని, వైసీపీలో చేరే అవకాశాలున్నాయని బాగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఎస్ఆర్ఐటీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమం కోసం యాత్ర కోసం రాయుడు అనంతపురం వచ్చారు. బుక్కరాయసముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న వైఎస్సార్ సర్కిల్ నుంచి కాలేజి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 

ఈ కార్యక్రమం సందర్భంగా రాయుడిని మీడియా పలకరించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాలను ఏకం చేయడమే వైసీపీ సామాజిక బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశమని రాయుడు అభిప్రాయపడ్డారు. జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలన్నీ నెరవేర్చారని కొనియాడారు. ఆయన భవిష్యత్తులోనూ మరెన్నో మంచి పనులు చేస్తారని రాయుడు పేర్కొన్నారు. 

తాను రాజకీయాల్లోకి రావడం, పోటీ చేయడంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రాష్ట్రమంతటా తిరుగుతున్నానని, ప్రజల సమస్యలు ఏంటనేది తెలుసుకుంటున్నానని వెల్లడించారు. గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వ పాలనను పోల్చుకుని తమకు ఎంత మంచి జరిగిందో, తాము ఎంత సంతోషంగా ఉన్నామో ప్రజలు చెబుతున్నారని రాయుడు పేర్కొన్నారు. తాను ఎక్కడ్నించి బరిలో దిగాలన్న దానిపై నిర్ణయం తీసుకోలేదని, అలాంటి నిర్ణయం తీసుకుంటే మీడియాకు తప్పకుండా చెబుతానని అన్నారు. 

తాను ఇటీవల కాలంలో అనేక కాలేజీలకు వెళ్లానని, అక్కడ విద్యార్థులతో మాట్లాడి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారితో చర్చించానని వెల్లడించారు. వారు ఎంచుకునే రంగాల్లో ఎదగాలని ప్రోత్సహిస్తున్నానని తెలిపారు. గుంటూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకం అయ్యానని రాయుడు వివరించారు. వారి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, విభేదాలను పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి రావాలని సూచించానని తెలిపారు. రాష్ట్ర విభజనతో ఏపీకి ఎంతో అన్యాయం జరిగిందని, కష్టనష్టాలను అధిగమించి ఎలా పైకి రావాలన్నదానిపై ప్రజలను ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. 

ఏపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ముఖ్యంగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువచ్చిందని, ఇది విద్యార్థులకు ప్రోత్సాహకరమైన అంశం అని రాయుడు వివరించారు. 

More Telugu News