Revanth Reddy: కోమటిరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా వికాస్ రాజ్ ఎత్తలేదు: రేవంత్ రెడ్డి

  • మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల పంపిణీ జరిగిందన్న రేవంత్ 
  • ఈ విషయం గురించి చెప్పడానికి వికాస్ రాజ్ కు ఫోన్ చేస్తే ఎత్తలేదని వెల్లడి 
  • పదేళ్ల పాటు మోదీ, కేసీఆర్ ఆస్తులు పంచుకున్నారని ఆరోపణ 
1000 Cr cash distributed from Ex IAS AK Goel residence

మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో కోట్లాది రూపాయలను ఉంచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఆయన ఇంటి నుంచి రూ. 1,000 కోట్లు పంపిణీ జరిగిందని చెప్పారు. ఆయన ఇంట్లో ఇంకా రూ. 300 కోట్లు ఉన్నాయని అన్నారు. ఈ విషయం గురించి చెప్పడానికి రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని మండిపడ్డారు. వికాస్ రాజ్ తో మాట్లాడేందుకు ఇద్దరు ఎంపీలం ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని చెప్పారు. ఏకే గోయల్ ఇంట్లో ఏమీ లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 

వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టి ఉద్యోగాలు ఇచ్చామని చెపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ జేసీబీ, క్రేన్ పెట్టి లేపినా బీఆర్ఎస్ లేవదని అన్నారు. పదేళ్ల పాటు మోదీ, కేసీఆర్ ఆస్తులు పంచుకున్నారని చెప్పారు. కేసీఆర్ కోరిక మేరకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తొలగించి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేశారని అన్నారు. ఎన్నికల సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఓటుకు రూ. 10 వేలు పంచేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు ఇదే చివరి రైతుబంధు అని చెప్పారు.

More Telugu News