Mallu Bhatti Vikramarka: కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై మల్లు భట్టి కీలక వ్యాఖ్యలు

  • కాంగ్రెస్ పార్టీ వంద శాతం అధికారంలోకి వస్తుందని మల్లు భట్టి ధీమా
  • సీఎం పదవిని ఆశించడంలో తప్పులేదని వ్యాఖ్య
  • పార్టీలో అందరి అభిప్రాయాలు తీసుకొని... అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టీకరణ
  • కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ ఒక్క ఎకరాకైనా అదనంగా నీరు ఇచ్చారా? అని ప్రశ్న
Mallu Bhatti Vikramarka responds on congress cm post

కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి... పదవిపై ఆ పార్టీ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వంద శాతం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఆశించడంలో తప్పులేదన్నారు. తమ పార్టీలో అందరి అభిప్రాయం తీసుకొని ప్రొసీజర్స్ ప్రకారం ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని వివరించారు. అధిష్ఠానం నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక ఉంటుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లోను కాంగ్రెస్ గెలిచి, ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుంటుందని జోస్యం చెప్పారు.

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆశయాలు నెరవేరలేదని, తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతిపై దర్యాఫ్తు జరిపిస్తామని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం తీరుతో ప్రభుత్వ వైఫల్యాలు తేలిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రతి ప్రాజెక్టులోనూ అవినీతి జరిగిందన్నారు. ధరణి దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధరణిని దోచుకోవడానికే తీసుకు వచ్చారన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పు చేసి కేసీఆర్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధే ఇప్పటికీ కనిపిస్తోందన్నారు. 

తాను మధిర నియోజకవర్గంలో ప్రజలనే నమ్ముతానన్నారు. కాంగ్రెస్ సునామీలా అత్యధిక స్థానాలు గెలవనుందని జోస్యం చెప్పారు. 70 నుంచి 85 సీట్లలో గెలుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉచిత విద్యుత్, విద్యుత్ ఉత్పత్తులపై పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు అదనంగా నాలుగు శాతం విద్యుత్ కేటాయించినట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ అదనంగా ఒక్క ఎకరాకు అయినా నీళ్లు ఇచ్చారా? అని నిలదీశారు.

  • Loading...

More Telugu News