Criminal Cases: తెలంగాణలో 226 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు.. కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై ఎన్ని కేసులు ఉన్నాయంటే..!

226 MLA candidates in Telangana face criminal cases
  • కాంగ్రెస్ పార్టీలో ఉన్న 84 మందిపై క్రిమినల్ కేసులు
  • రేవంత్, రాజాసింగ్ లపై 89 చొప్పున కేసులు
  • కేసీఆర్ పై 9, కేటీఆర్ పై 8 కేసులు

మరో తొమ్మిది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా సర్వ శక్తులను ఒడ్డుతూ... ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. మరోవైపు... ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్ ను అనలైజ్ చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సంచలన విషయాలను వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన 226 మంది అభ్యర్థులపై క్రమినల్ కేసులు ఉన్నాయని సదరు సంస్థ తెలిపింది.  

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెందని 360 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 78 మంది క్రిమినల్ కేసులు కలిగిన అభ్యర్థులతో బీజేపీ రెండో స్థానంలో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 58 మందిపై కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం సమయంలో కొందరిపై కేసులు నమోదయ్యాయి. కొందరిపై చిన్ని కేసులు మాత్రమే ఉన్నాయని... అయినా కేసులను పరిగణనలోకి తీసుకున్నట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. 

కాంగ్రెస్ పార్టీ తరపున 118 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 84 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అత్యధిక కేసులతో జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆయనపై 89 కేసులు ఉన్నాయి. 52 కేసులతో ఖనాపూర్ నియోజకవర్గానికి చెందిన వెడ్మ బొజ్జు (కాంగ్రెస్), 32 కేసులతో కరీంనగర్ అభ్యర్థి పురుమల్ శ్రీనివాస్ ఉన్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిపై 20 కేసులు నమోదయ్యాయి. 

బీజేపీ విషయానికి వస్తే గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ పై కూడా రేవంత్ తో సమానంగా 89 కేసులు ఉన్నాయి. బండి సంజయ్ పై 59 కేసులు ఉన్నాయి. ఈటల రాజేందర్ పై 40 కేసులు, రఘునందన్ రావుపై 27 కేసులు ఉన్నాయి. 

బీఆర్ఎస్ విషయానికి వస్తే... 58 మందిపై కేసులు ఉన్నాయి. మంత్రి గంగుల కమలాకర్ 10 కేసులతో తొలి స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై 9 కేసులు, కేటీఆర్ పై 8 కేసులు ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై 6 కేసులు ఉన్నాయి. కొందరు అభ్యర్థులపై 15 నుంచి 20 ఏళ్లుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అభ్యర్థులపై నమోదైన కేసులతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు కూడా గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చాయని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తెలిపింది. 

  • Loading...

More Telugu News