Revanth Reddy: కేసీఆర్ అధికారంలోకి వచ్చాక... వారి కుటుంబం మాత్రమే బాగుపడింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy congress vijayabheri meeting in narsapur
  • నర్సాపూర్ కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
  • నిరుద్యోగంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిచిందన్న టీపీసీసీ చీఫ్
  • ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా
కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నరేళ్లయిందని, ఈ సమయంలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయభేరీ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయనుకుంటే రైతుల ఆత్మహత్యలు కలచివేశాయన్నారు. నిరుద్యోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు.

వచ్చే నెలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. రైతులకు, ఉపాధి కూలీలకు, రైతు కూలీలకు కూడా అండగా ఉంటామన్నారు. గృహలక్ష్మి పథకం కింద పేదల ఇళ్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు రూ.2500 అందిస్తామన్నారు. కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎవరికీ రాలేదని, కానీ పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల చొప్పున అందిస్తుందన్నారు. వచ్చే నెల కాంగ్రెస్ గెలుస్తుందని, అప్పుడు పెన్షన్ రూ.4వేలకు పెంచుతామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.500కే అందిస్తామని హామీ ఇచ్చారు. మేం ఇన్ని మంచి పనులు చేయాలంటే మీరు ఒకే ఒక మంచి పని చేయాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చాలని కోరారు.
Revanth Reddy
Congress
Telangana Assembly Election
BRS

More Telugu News