ఎన్టీఆర్ రూ.2కి కిలో బియ్యం ఇచ్చేదాకా ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి బతుకులే!: కేసీఆర్
- ఇందిరమ్మ రాజ్యం తేవాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం
- బీఆర్ఎస్ వచ్చాక పాలమూరులో మారిన పరిస్థితుల్ని గమనించాలన్న కేసీఆర్
- ప్రజాస్వామ్యంలో గూండాలు, ఫ్యాక్షనిస్టులు, రౌడీలు గెలవకూడదన్న ముఖ్యమంత్రి
కాంగ్రెస్‌ను గెలిపించి మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తేవాలని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, కానీ ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి బతుకులే అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మనం చూడలేదా? అన్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీ... రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చేదాక ఆకలి బతుకులే కదా? ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులే అన్నారు. అంతకుముందు పేదల బాధలను పట్టించుకున్నది లేదన్నారు. పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదన్నారు. తెలంగాణను నాశనం చేశారన్నారు. అలంపూర్ నుంచి పార్టీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్‌ను గెలిపిస్తే కరవు అనేది అలంపూర్ రాకుండా చూసే బాధ్యత తనదే అన్నారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను కాంగ్రెస్ పెండింగులో పెట్టిందన్నారు.