Rohit Sharma: ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ కోసం మేం ఎప్పటి నుంచి సన్నద్ధమవుతున్నామో తెలుసా..?: రోహిత్ శర్మ

Rohit Sharma attends press conference ahead of world cup final
  • రేపు వరల్డ్ కప్ ఫైనల్
  • వేదికగా నిలుస్తున్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం
  • కప్ కోసం టీమిండియా, ఆసీస్ మధ్య అంతిమ పోరాటం
  • ఫైనల్ నేపథ్యంలో రోహిత్ శర్మ మీడియా సమావేశం 

ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముంగిట టీమిండియా సారథి రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ వరల్డ్ కప్ కోసం తాము రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించామని వెల్లడించాడు. తాను కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని సన్నద్ధమవుతున్నామని తెలిపాడు. జట్టులో ఏ ఆటగాడు ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు. 

టీమిండియా బృందంలో కోచ్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఎనలేనిదని  రోహిత్ శర్మ తెలిపాడు. ఆటగాళ్లను తమ బాధ్యతలు నెరవేర్చేలా సన్నద్ధం చేయడంతో పాటు, ఆ దిశగా వారికి స్వేచ్ఛ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పించడంలో ద్రావిడ్ పాత్ర అమోఘం అని కితాబునిచ్చాడు. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం తర్వాత కూడా ద్రావిడ్ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచాడని, దాన్ని బట్టే ఆయన ఏంటనేది అర్ధమవుతుందని తెలిపాడు. 

"నేను, ద్రావిడ్ జట్టులో ఒక సుహృద్భావ వాతావరణం సృష్టించాం. దాని పట్ల ఎంతో సంతృప్తి చెందుతున్నా. బయటి చికాకులు ఆటగాళ్ల దరి చేరని విధంగా చర్యలు తీసుకున్నాం. ఆటగాళ్లు ఈ వాతావరణంలో చక్కగా ఇమిడిపోతున్నారు. ఆటగాళ్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అది వారి ప్రదర్శనపై సానుకూల ప్రభావం చూపుతోంది. ఇక, 2011లో నా వరకు చాలా కష్ట సమయం అది. కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. ఓ వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తానని ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ అది ఇవాళ జరిగింది" అని వివరించాడు. 

ఈ వరల్డ్ కప్ లో 23 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్న మహ్మద్ షమీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. టోర్నీ తొలి భాగంలో షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశం అని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ... సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచాడని కొనియాడాడు. నెట్స్ లో షమీ తన బౌలింగ్ కు మరింత గా సానబెట్టుకున్నాడని కితాబునిచ్చాడు.

  • Loading...

More Telugu News