Amit Shah: బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్ షా సెటైర్లు

Amit Shah says ayodhya srirama darshan free if bjp win in telangana
  • బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న అమిత్ షా
  • బీజేపీ గెలిస్తే అయోధ్య శ్రీరాములవారి దర్శనం ఉచితంగా ఏర్పాటు చేస్తామని హామీ
  • కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని విమర్శ
తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. గద్వాలలో నిర్వహించిన సకల జనుల సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ గెలిస్తే తెలంగాణ ప్రజలకు అయోధ్య శ్రీరాములవారి దర్శనం ఉచితంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే అత్యధిక సీట్లు కేటాయించామన్నారు. శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి పుణ్యస్థలానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

జోగులాంబ ఆలయ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం రూ.70 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కానీ ఈ ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఆ హామీని నెరవేర్చలేదన్నారు. పైగా మోదీ ఇచ్చిన డబ్బును కూడా ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదన్నారు. గుర్రంగూడ బ్రిడ్జిని... గద్వాలలో 300 పడకల ఆసుపత్రిని... కృష్ణా నదిపై బ్రిడ్జిని... చేనేతల కోసం హ్యాండ్లూమ్ వీవర్స్ పార్క్ నిర్మించలేదన్నారు. డబుల్ బెడ్రూం హామీని కూడా నెరవేర్చలేదన్నారు. పాలమూరు - రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టును ఇంకా పూర్తి చేయలేదన్నారు. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించినవారు లేరన్నారు.

కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలు అని సెటైర్లు వేశారు. తెలంగాణ యువతను కేసీఆర్ మోసం చేశారని, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో యువత జీవితాలతో ఆడుకున్నారన్నారు. బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధి సాధ్యమన్నారు. బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు.
Amit Shah
BJP
Ayodhya Ram Mandir
Telangana Assembly Election
Jogulamba Gadwal District

More Telugu News