Uttarakhand Tunnel: మరోసారి నిలిచిపోయిన ‘ఉత్తరాఖండ్ సొరంగం రెస్క్యూ ఆపరేషన్’ పనులు

Rescue Work In Uttarakhand Tunnel again Paused After Cracking Sound
  • పెద్దగా పగుళ్ల శబ్దం రావడంతో పనుల నిలిపివేత
  • నిపుణుల బృందంతో సమావేశానికి సిద్ధమవుతున్న రెస్క్యూ బృందం
  • ఆరు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చర్యలు
ఉత్తరాఖండ్‌లో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కూలడంతో లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల కోసం 6 రోజులుగా చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ పనులు మరోసారి నిలిచిపోయాయి. పెద్దగా పగుళ్ల శబ్దం వినిపించడంతో శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు రెస్క్యూ పనులు నిలిపివేసినట్టు జాతీయ రహదారులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడీసీఎల్) ప్రకటించింది. పనులు చేసే మార్గం బ్లాక్ అయ్యిందని, దీంతో డ్రిల్లింగ్ పనులు నిలిపివేసినట్టు వెల్లడించింది. సొరంగం లోపల రెస్క్యూ పనుల్లో ఉన్నవారికి పగుళ్ల శబ్దం పెద్దగా వినిపించిందని, ఈ పరిణామంతో సొరంగంలో పని చేస్తున్న బృందంలో భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొంది. సొరంగం మరింత కూలడానికి ఎక్కువ అవకాశాలు ఉండడంతో లోపలికి పైప్ నెట్టే కార్యక్రమాలను నిలిపివేసినట్టు వివరించింది. తాజా పరిస్థితిపై నిపుణులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపింది. 

కాగా గత ఆరు రోజులుగా సొరంగం రెస్క్యూ ఆపరేషన్ పనులు కొనసాగుతున్నాయి. కాగా కొండచరియలు విరిగిపడిన కారణంగా ఉత్తరకాశీ సమీపంలో నిర్మాణంలో ఉన్న సొరంగం కొంత భాగం ఆదివారం ఉదయం కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 40 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు చేపడుతున్న పనులు సజావుగా సాగడం లేదు. ఆపరేషన్ చేపడుతుండగా విరిగిపడుతున్న కొండచరియలు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. ముఖ్యంగా మార్గం బ్లాక్ అవుతుండడం ఇబ్బందికరంగా మారుతోంది. 2018లో థాయ్‌లాండ్‌లోని గుహలో చిక్కుకున్న పిల్లలను విజయవంతంగా రక్షించిన వారితోసహా, నార్వే ఎలైట్ రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్ చర్యల్లో పాల్గొన్నాయి. మరోవైపు ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, బీఆర్‌వో, ఐటీబీపీతోపాటు పలు ఏజెన్సీలకు చెందిన 165 మంది సిబ్బంది 24 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే.
Uttarakhand Tunnel
Tunnel Rescue Operation
Uttarakhand
workers trapped

More Telugu News