Virat Kohli: కోహ్లీ ఎన్ని రన్స్ చేస్తే అంత డిస్కౌంట్... రెస్టారెంట్ కు పోటెత్తిన జనాలు... చివరికి ఏం జరిగిందంటే...!

Biryani lovers rushed to UP restaurant after Kohli made 50th ton
  • నిన్న సెమీస్ లో కోహ్లీ సెంచరీ
  • 100 శాతం డిస్కౌంట్ తో ఫ్రీగా బిర్యానీ అందించిన యూపీ రెస్టారెంట్
  • బిర్యానీ అయిపోయినా ఎగబడిన జనాలు
  • పోలీసుల సాయం తీసుకున్న రెస్టారెంట్ యాజమాన్యం
టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసి, మొత్తం 50 సెంచరీలతో వన్డే క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. అయితే, సెమీస్ కు ముందు ఉత్తరప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్ యజమాని బిర్యానీపై బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కోహ్లీ ఎన్ని పరుగులు చేస్తే తన రెస్టారెంట్ లో అంత పర్సెంటేజీతో డిస్కౌంట్ ఇస్తానని తెలిపాడు.

 'లక్నో రసోయి' అనే ఈ రెస్టారెంట్ బహ్రెయిచ్ ప్రాంతంలో ఉంది. కోహ్లీ నిన్నటి మ్యాచ్ లో సెంచరీ చేయడం తెలిసిందే. ఇంకేముంది, బహ్రెయిచ్ లోని రెస్టారెంట్ కు జనాలు పోటెత్తారు. బిర్యానీ రేటు రూ.200 అనుకుంటే, కోహ్లీ సెంచరీ చేశాడు కాబట్టి 100 శాతం డిస్కౌంట్ తో ఫ్రీగా ఇవ్వక తప్పలేదు. 

ఈ ఆఫర్ గురించి తెలియడంతో ఎక్కడెక్కడ్నించో బిర్యానీ ప్రియులు తరలి రావడంతో రెస్టారెంట్ వద్ద భారీ రద్దీ చోటుచేసుకుంది. బిర్యానీ అయిపోయినప్పటికీ జనాలు వస్తూనే ఉన్నారు. ప్రజల తాకిడిని తట్టుకోలేక చివరికి రెస్టారెంట్ యాజమాన్యం పోలీసుల సాయం తీసుకోవాల్సి వచ్చింది. 

అప్పటికే క్యూలో ఉన్న వారు తమకు బిర్యానీ ఇవ్వాల్సిందేనంటూ గొడవకు దిగారు. ఉచితంగా వచ్చే బిర్యానీ కోసం జనాలు ఎంతకైనా తెగించేలా ఉన్నారని భావించిన రెస్టారెంట్ ఓనరు షట్టర్లు మూసేశాడు. అప్పటికి గానీ జనాలు వెనుదిరగలేదు.
Virat Kohli
Century
Lucknow Rasoi
Restaurant
Discount
Biryani
Bahraich
Uttar Pradesh

More Telugu News