Pakistan Cricket Team: ధోనీని ఉదహరిస్తూ పాకిస్థాన్ క్రికెట్ పై విమర్శలు గుప్పించిన మొహమ్మద్ ఆమిర్

Mohammad Amir On Pakistans System Amid Cricket World Cup Debacle
  • పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఇంటా, బయటా విమర్శలు
  • పాక్ కెప్టెన్ మైండ్ సెట్ మారిందన్న మొహమ్మద్ ఆమిర్
  • ఇండియాకు ధోనీ ఒక మంచి టీమ్ ను ఇచ్చాడని కితాబు
ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు సెమీస్ కు చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టుపై ఇంటా, బయటా విమర్శల వాన కురుస్తోంది. కొందరు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ను విమర్శిస్తుండగా... మరి కొందరు పాక్ క్రికెట్ సిస్టంను తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ ఆమిర్ స్పందిస్తూ... సిస్టంను తప్పు పట్టొద్దని సూచించారు. 

సిస్టం అనేది గెలపుకు అడ్డుగోడ కాదని ఆమిర్ అన్నారు. పాకిస్థాన్ క్రికెట్ ను నడిపించేందుకు ఐదు నుంచి ఆరుగురికి బాధ్యతలను అప్పగించారని... వారిలో కెప్టెన్ కూడా ఒకరని చెప్పారు. 1992లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో ప్రపంచ కప్ గెలిచామని, అప్పుడు కూడా సేమ్ సిస్టం ఉందని అన్నారు. 2009లో టీ20 ప్రపంచకప్ ను గెలిచామని, 2017లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచామని... అప్పుడు కూడా సేమ్ సిస్టం ఉందని చెప్పారు. 

నాలుగేళ్లుగా పాక్ కెప్టెన్ గా బాబర్ ఉన్నాడని, ఆయన తన సొంత టీమ్ ను నిర్మించుకున్నాడని అన్నారు. ముందు నుంచి కూడా సిస్టం ఒకేలా ఉందని... కెప్టెన్ మైండ్ సెట్ మాత్రమే మారిందని చెప్పారు. అబ్రార్ అహ్మద్ ను ఆడించొద్దని బాబర్ కు ఎవరు చెప్పారని, తొలి మ్యాచ్ తర్వాత ఫకర్ ను బెంచ్ కు పరిమితం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. 

ఇండియన్ క్రికెట్ ను ధోనీ మార్చేశాడని అందరం చెపుతుంటామని... కానీ, ధోనీ సిస్టంను మార్చలేదని ఆమిర్ అన్నారు. అశ్విన్, జడేజాలకు ఎంత కాలం ఛాన్సులు ఇస్తారని జనాలు ప్రశ్నిస్తుంటారని... కానీ ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఆల్ రౌండర్ జడేజానే అని... ఇండియాకు ధోనీ ఒక మంచి టీమ్ ను ఇచ్చాడని కొనియాడారు.
Pakistan Cricket Team
Mohammad Amir
Babar Azam
MS Dhoni
ODI World Cup
Cricket

More Telugu News