Yanamala: కేంద్రం వద్దన్నా 75 పథకాలకు జగన్, వైఎస్ పేర్లు: యనమల రామకృష్ణుడు

  • జగన్ తీరుతో నాలుగేళ్లలో రాష్ట్రం వేలకోట్లు కోల్పోయిందన్న యనమల
  • రూ. 71,449 కోట్లను నిమిషాల్లోనే దారి మళ్లించారని ఆరోపణ
  • రంగులపై ఉన్న శ్రద్ధ.. ప్రజా సంక్షేమంపై లేదని ఫైర్
TDP leader Yanamala Once Again Slams YS Jagan

ఏపీ సీఎం జగన్‌కు రంగులపైనా, పేర్లపైనా ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. బడుగు బలహీనవర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం కేటాయిస్తున్న నిధులను అవినీతి, దుబారా కార్యక్రమాలకు దారిమళ్ళించి ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 94కు పైగా కేంద్ర పథకాలకు జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయకపోవడంతో నాలుగేళ్లలో వేలకోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయం నుంచి ఆరోగ్యశాఖ వరకు, పరిశ్రమల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు ఇలా ప్రతి రంగానికి కేంద్రం విడుదల చేస్తున్న నిధులన్నింటినీ దారి మళ్లించడమే ఎజెండాగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఈ నాలుగున్నరేళ్లలో రూ. 71,449 కోట్ల నిధులు కేంద్రం నుంచి వచ్చిన నిమిషాల వ్యవధిలోనే దారిమళ్ళించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

జగన్ రాచరిక పోకడలకు నిదర్శనం
ప్రభుత్వ పథకం ముందు జగన్, వైఎస్సార్ పేర్లు చేర్చడాన్ని కేంద్రం తప్పుబట్టినా తీరు మార్చుకోకపోవడంతో రూ. 6 వేల కోట్ల నిధులను నిలిపి వేసిందన్నారు. దీనికి జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యక్తిగత ప్రచారం కోసం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 75 పథకాలకు జగన్, వైఎస్ పేర్లు పెట్టుకోవడం రాచరిక పోకడలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. మూలధన వ్యయం కోసం రావాల్సిన రూ.4 వేల కోట్లు నిలిచిపోవడానికి జగనే కారణమని దుయ్యబట్టారు.

నిధుల దారిమళ్లింపు
పేద, మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు కేంద్రం మంజూరు చేసిన రూ.3,084 కోట్ల నిధులను దారిమళ్లించారని యనమల ఆరోపించారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న హామీని  అమలు చేయకపోవడమే కాకుండా, ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దారిమళ్ళించి పేద ప్రజలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరవు సాయం కోసం కేంద్రం నుంచి వచ్చిన రూ. 900 కోట్ల నిధులను కూడా రైతులకు ఇవ్వలేదని,  14, 15 ఆర్థిక సంఘం పంచాయతీల అభివృద్ధికి కేటాయించిన నిధులను సర్పంచ్‍ల డిజిటల్ కీలను అక్రమంగా వాడి రూ. 8.60 కోట్ల నిధులను మాయం చేశారని దుమ్మెత్తి పోశారు. ఉపాధిహామీ నిధులను కూడా దారిమళ్లించి గ్రామీణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నారని, నాలుగున్నరేళ్లలో రూ.7,879 కోట్ల నిధులను దారిమళ్లించి లక్షలాదిమంది వలసలకు కారణమయ్యారని యనమల ఆరోపించారు.

More Telugu News