Team India: శ్రేయాస్ అయ్యర్, రాహుల్ 'శతక' బాదుడు... టీమిండియా రికార్డు స్కోరు

Team India posts highest team score in World Cups
  • బెంగళూరులో టీమిండియా × నెదర్లాండ్స్
  • 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసిన టీమిండియా
  • పరుగుల వర్షం కురిపించిన టీమిండియా టాపార్డర్
  • వరల్డ్ కప్ లలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు
  • టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రాహుల్
వరల్డ్ కప్ చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు జూలు విదిల్చారు. నెదర్లాండ్స్ పై కళ్లు చెదిరే భారీ స్కోరు సాధించారు. ఒకరి తర్వాత ఒకరు పోటీలు పడి మరీ డచ్ బౌలింగ్ ను ఊచకోత కోశారు. 

కెప్టెన్ రోహిత్ శర్మ (61), శుభ్ మాన్ గిల్ (51), విరాట్ కోహ్లీ (51) అర్ధసెంచరీలతో రాణించగా... శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ సెంచరీలతో పరుగుల బీభత్సం సృష్టించారు. అయ్యర్, రాహుల్ పిడుగుల్లాంటి షాట్లతో బంతికి చుక్కలు చూపించారు. శ్రేయాస్ అయ్యర్ 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 128 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

కేఎల్ రాహుల్ మరింత దూకుడుగా ఆడి 62 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. కేఎల్ రాహుల్ మొత్తం 64 బంతులాడి 102 పరుగులు చేసి అవుటయ్యాడు. రాహుల్ స్కోరులో 11 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్  నిలిచాడు. ఈ వరల్డ్ కప్ లోనే ఆఫ్ఘనిస్థాన్ పై కెప్టెన్ రోహిత్ శర్మ 63 బంతుల్లో చేసిన సెంచరీ రాహుల్ ఘనతతో తెరమరుగైంది. 

బెంగళూరులో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల అతి భారీ స్కోరు నమోదు చేసింది. వరల్డ్ కప్ లలో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. 2007 వరల్డ్ కప్ లో బెర్ముడాపై టీమిండియా 5 వికెట్లకు 413 పరుగులు చేసింది. తాజాగా నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో టీమిండియా ఈ రికార్డును అధిగమించింది.
Team India
Nederlands
Bengaluru
World Cup

More Telugu News