Balakrishna: బాలకృష్ణ 'బ్యాటిల్ ఆఫ్ బ్రీత్స్' ఏంటి?... ఆసక్తి రేపుతున్న స్టార్ స్పోర్ట్స్ వీడియో

Star Sports Telugu posts Balakrishna Battle Of Breaths video
  • బాబీ చిత్రంలో బాలకృష్ణ కొత్త చిత్రం
  • యుద్ధ వీరుడిగా గుర్రపుస్వారీ మేకింగ్ వీడియో రిలీజ్
  • సరికొత్త వీడియోను పంచుకున్న స్టార్ స్పోర్ట్స్ చానల్
ఇటీవల వచ్చిన భగవంత్ కేసరి చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటిస్తున్నాడు. ఇది బాలకృష్ణకు 110వ చిత్రం. ఈ చిత్రం నుంచి ఇటీవల బ్యాటిల్ ఆఫ్ బ్రీత్స్ పేరిట ఓ వీడియో రిలీజైంది. 

అందులో బాలకృష్ణ సినిమాలో యుద్ధ వీరుడిగా గుర్రపుస్వారీ చేసే మేకింగ్ విజువల్స్ ఉన్నాయి. అయితే, ఈ ఫుటేజి ఆధారంగా స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ సరికొత్తగా ఓ వీడియోను పంచుకుంది. ఇందులో, ఓవైపు బాలకృష్ణ గుర్రంపై స్వారీ చేస్తుండగా, మరోవైపు కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ కూడా గుర్రంపై దూసుకువస్తుండడం చూడొచ్చు. కత్తులు లేవు, ఈటెలు లేవు... ఊపిరి బిగబట్టే యుద్ధం అంటూ ఓ పాట కూడా ఈ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంటుంది. 

అసలు ఈ బ్యాటిల్ ఆఫ్ బ్రీత్స్ ఏంటి? ఈసారి బాలయ్య ఎటువంటి యాక్షన్ తో మీ ముందుకు రాబోతున్నాడు? మాకు తెలుసు మీరు వెయిల్ చేయలేరని... మేం కూడ అంతే" అంటూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు పేర్కొంది. ఇదేంటో  తెలియాలంటే డిసెంబరు 2 వరకు ఆగాల్సిందేనని తెలిపింది. 

అయితే ఇదంతా కన్నడ చలనచిత్ర కప్ (కేసీసీ) క్రికెట్ టోర్నీకి సంబంధించిన వ్యవహారం అని తెలుస్తోంది. ఇది ప్రధానంగా టీ-10 క్రికెట్ టోర్నీ. కన్నడ సినీ తారలు, అంతర్జాతీయ మాజీ క్రికెటర్లతో ఈ టోర్నీ నిర్వహించనున్నట్టు సమాచారం. 

మరి ఇందులో బాలకృష్ణ పాత్ర ఏంటన్నది తెలియాల్సి ఉంది. బహుశా ఆయన కామెంటేటర్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి. గత ఐపీఎల్ లో కామెంటేటర్ గా వ్యవహరించిన అనుభవం బాలయ్యకు ఉంది.
Balakrishna
Battle Of Breaths
Star Sports Telugu
Video

More Telugu News