Bangladesh: అంతా అయిపోయాక రాణించిన బంగ్లాదేశ్ బ్యాటర్లు... ఆసీస్ పై భారీ స్కోరు

Bangladesh posts huge totla against mighty Aussies
  • వరల్డ్ కప్ లో నేడు డబుల్ హెడర్
  • తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా × బంగ్లాదేశ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
  • 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసిన బంగ్లా
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చెత్తగా ఆడిన జట్లలో బంగ్లాదేశ్ ఒకటి. గత కొంతకాలంగా ఆట పరంగా ఎంతో ఎదిగిన బంగ్లాదేశ్ మెగా టోర్నీలో అడుగుపెట్టేసరికి సాధారణ జట్టులా కనిపించింది. వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టు బంగ్లానే. ఇవాళ ఆ జట్టు బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతోంది. 

పూణేలో జరుగుతున్న ఈ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 306 పరుగులు చేసింది. టోర్నీలో మొదటిసారిగా బంగ్లాదేశ్ బ్యాటర్లు అందరూ సత్తా చాటింది ఈ మ్యాచ్ లోనే. 

తౌహిద్ హృదయ్ అత్యధికంగా 74 పరుగులు చేయగా... ఓపెనర్లు టాంజిద్ హుస్సేన్ 36, లిట్టన్ దాస్ 36 పరుగులతో రాణించారు. షకీబ్ అల్ హసన్ గైర్హాజరీలో ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న నజ్ముల్ హుస్సేన్ శాంతో 45, మహ్మదుల్లా 32, ముష్ఫికర్ రహీమ్ 21, మెహిదీ హసన్ మిరాజ్ 29 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో షాన్ అబ్బాట్ 2, ఆడమ్ జంపా 2, మార్కస్ స్టొయినిస్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ కు విశ్రాంతి ఇచ్చారు. 

ఇక, 307 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఆసీస్ జట్టు 12 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 10 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 5 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 36 పరుగులు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 3, మిచెల్ మార్ష్ 22 పరుగులతో ఆడుతున్నారు.
Bangladesh
Australia
Pune
World Cup

More Telugu News