KA Paul: నామినేషన్లకు రేపు ఆఖరు తేదీ... ఇప్పటి దాకా సింబల్ ఇవ్వలేదు: కేఏ పాల్ ఆగ్రహం

  • సెప్టెంబర్‌లో డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చినప్పటికీ గుర్తును కేటాయించలేదన్న కేఏ పాల్
  • ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారా? ఎన్నికల కమిషనర్ నడుపుతున్నారా? అని నిలదీత
  • నన్ను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని కేఏ పాల్ ఆవేదన
  • తమకు గుర్తును కేటాయించి నామినేషన్ కు సమయం ఇవ్వాలని డిమాండ్
KA Paula talks about his partys elections symbol

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌కు గడువు రేపటి వరకే ఉందని, అయినా ఇప్పటి వరకు తన పార్టీకి గుర్తును కేటాయించలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను సెప్టెంబర్ నెలలోనే డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చానన్నారు. కానీ ఇప్పటి వరకు గుర్తును కేటాయించలేదన్నారు. పార్టీ యాక్టివ్‌గా లేదని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కేసీఆర్ నడుపుతున్నారా? ఎన్నికల కమిషనర్ నడుపుతున్నాడా? అన్నది తమకు అర్థం కావడం లేదని విమర్శించారు.

అసలు ఎన్నికల్లో పోటీ చేయని షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుర్తును కేటాయించారని, కానీ తమకు కేటాయించలేదన్నారు. తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్తే సింబల్ ఏమిటి? అని అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. తనను ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికల్లో గుర్తు కోసం తాను నిరాహార దీక్ష చేయాలా? అని ప్రశ్నించారు. హెలికాప్టర్, రింగ్ గుర్తుల్లో ఏది కేటాయిస్తారో చెప్పడం లేదన్నారు. తనకు ఆరు నెలలుగా గుర్తు ఇస్తానని చెబుతున్నారు తప్ప కేటాయించలేదన్నారు.

చట్టాలు మారాలంటే తనలాంటి వాడిని గెలిపించాలన్నారు. తన పోరాటంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం నిలిచిపోయినట్లు చెప్పారు. ఇప్పటికైనా ప్రజాశాంతి పార్టీకి గుర్తును కేటాయించి నామినేషన్ కోసం మరో రెండు రోజుల సమయం ఇవ్వాలన్నారు. తమకు పార్టీ గుర్తు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పలువురు అభ్యర్థులు పోటీ చేస్తారని, తాను ప్రచారం కోసం పోటీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పారు.

More Telugu News