Sourav Ganguly: 16 ఏళ్ల క్రితమే సౌరవ్ గంగూలీ ‘టైమ్‌డ్ ఔట్’ అయ్యాడు.. కానీ ఎలా బతికిపోయాడంటే..?

  • అనివార్య పరిస్థితుల కారణంగా ఆలస్యంగా క్రీజులోకి వెళ్లిన దాదా
  • 3 నిమిషాల కంటే ఎక్కువ ఆలస్యంగా బ్యాటింగ్‌కు గంగూలీ
  • దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అప్పీల్ చేయకపోవడంతో బతికిపోయిన దాదా
Sourav Ganguly was timed out 16 years ago but survive because of south africa captain

వరల్డ్ కప్ 2023లో భాగంగా శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఒక ఆటగాడు ‘టైమ్‌డ్ ఔట్’గా వెనుదిరిగిన ఘటన నమోదయ్యింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ నిర్దేశిత సమయంలోపు క్రీజులోకి చేరుకోకపోవడంతో అంపైర్లు అతడిని ఔట్‌గా ప్రకటించారు. 2 నిమిషాల వ్యవధిలోనే క్రీజులోకి రావాల్సి ఉండగా హెల్మెట్ సమస్య కారణంగా చేరుకోలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అప్పీల్ చేయడం, అంపైర్లు ఔట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలిసారి కావడంతో టైమ్‌డ్ ఔట్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి టీమిండియా మాజీ దిగ్గజం సౌరవ్ గంగూలీ పేరిట కొన్నేళ్ల క్రితమే ఈ ‘టైమ్‌డ్’ రికార్డ్ నమోదయ్యి ఉండేది. కానీ అదృష్టం కొద్దీ బయటపడ్డాడు.


16 ఏళ్ల క్రితం ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ‘టైమ్‌డ్ ఔట్’ అయ్యాడు. కానీ నాటి సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ‘టైమ్‌డ్ ఔట్’ అప్పీల్ చేయకూడదని భావించాడు. నిర్ణయించుకున్నట్టుగానే అంపైర్‌కి అప్పీల్ చేయలేదు. గంగూలీ క్రీజులోకి వచ్చేంత వరకు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎదురుచూశారు. దీంతో 3 నిమిషాల తర్వాత క్రీజులోకి వచ్చినా గంగూలీ బతికిపోయాడు. గంగూలీ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కొన్ని అనివార్య కారణాలున్నాయి. భారత్ వికెట్ కోల్పోవడంతో సచిన్ టెండూల్కర్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే అతడు పిచ్‌పై చాలా సమయం గడిపి అలసిపోయి ఉండడంతో బ్యాటింగ్‌కు అనుమతించలేదు. దీంతో వీవీఎస్ లక్ష్మణ్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ అతడు స్నానం చేస్తుండడంతో గంగూలీ అనివార్యంగా క్రీజులోకి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి అప్పటికే డ్రెసింగ్ రూమ్ ట్రాక్స్‌లో ఉన్నాడు. అనూహ్య పరిణామంతో డ్రెస్ మార్చుకొని క్రీజులోకి వెళ్లాడు. దీంతో నిర్దేశిత 3 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టింది. ఎట్టకేలకు దక్షిణాఫ్రికా కెప్టెన్ అప్పీల్ చేయకపోవడంతో 16 ఏళ్ల క్రితం ‘టైమ్‌డ్ ఔట్’ నుంచి సౌరవ్ గంగూలీ బతికిపోయాడు.

కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో వికెట్ పడ్డాక 3 నిమిషాలు ముందుగానే తదుపరి బ్యాట్స్‌మెన్ క్రీజులోకి రావాల్సి ఉంది. 2023 వన్డే ప్రపంచకప్‌ నిబంధనల్లో ఆ గడువు 120 సెకన్లుగా మార్చారు. ఆ గడువు లోగా బ్యాటర్‌ రాకపోతే.. దాన్ని టైమ్‌డ్‌ ఔట్‌గా ప్రకటిస్తారు.

More Telugu News