Nara Lokesh: ఘోర బస్సు ప్రమాదానికి వైసీపీ ప్రభుత్వమే కారణం: నారా లోకేశ్

YSRCP govt is accountable for Vijayawada bus accident
  • విజయవాడ బస్సు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
  • కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్న లోకేశ్
  • మృతులు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్లాట్ ఫామ్ మీదకు బస్సు దూసుకుపోయిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ ప్రమాదానికి వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. ప్లాట్ ఫామ్ పైకి బస్సు దూసుకురావడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని చెప్పారు. 

కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని... వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని లోకేశ్ విమర్శించారు. ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోళ్లకు కూడా ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు.

Nara Lokesh
Telugudesam
YSRCP
Bus Accident
Vijayawada

More Telugu News