Thummala: ఆ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ ఒప్పుకోరు.. చంద్రబాబును అడగండి నిజం తెలుస్తుంది: తుమ్మల నాగేశ్వరరావు

  • చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించానన్న తుమ్మల
  • కేసీఆర్ మంత్రి కాకముందే తాను మూడు సార్లు మంత్రినయ్యానని వ్యాఖ్య
  • తనపై ప్రేమతోనో, జాలితోనో కేసీఆర్ బీఆర్ఎస్ లోకి తీసుకోలేదని విమర్శ
Ask Chandrababu about KCR says Thummala

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. వివిధ పార్టీల నేతలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మధ్య పేలుతున్న మాటల తూటాలు రాజకీయాలను మరింత రంజుగా మారుస్తున్నాయి. 

నిన్న ఖమ్మంలో నిర్వహించిన సభలో తుమ్మలపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి తుమ్మల ఇంట్లో కూర్చున్నారని... ఆయనను తానే పిలిచి మంత్రి పదవిని ఇచ్చానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తుమ్మల అదే స్థాయిలో ప్రతిస్పందించారు. 

కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వడం కాదని... ఆయనకు తానే మంత్రి పదవిని ఇప్పించానని తుమ్మల అన్నారు. గతంలో తనతో పాటు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నారని... ఆ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. తొలుత కేసీఆర్ కు చంద్రబాబు అటవీశాఖను ఇచ్చారని... ఆ శాఖ కేసీఆర్ కు ఇష్టం లేకపోతే... తాను బాబుతో మాట్లాడి రవాణాశాఖను ఇప్పించానని తెలిపారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి... చంద్రబాబును అడిగితే నిజం తెలుస్తుందని అన్నారు. 

తనపై ప్రేమతోనో, ఓడిపోయానన్న జాలితోనో తనను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి తీసుకోలేదని తుమ్మల చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ జెండా పట్టేవాడు లేకపోవడం వల్లే తనను తీసుకున్నారని అన్నారు. ఖమ్మం ప్రజల కలల సీతారామ ప్రాజెక్టు కోసం మంత్రి పదవి తీసుకున్నానని చెప్పారు. కేసీఆర్ కంటే ముందే మూడు సార్లు మంత్రిగా చేసిన ఘనత తనదని వ్యాఖ్యానించారు. ప్రజలు కేసీఆర్ ను గద్దె దింపడం ఖాయమని జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News