Team India: ఎవరైతే మాకేంటి... సఫారీలను కూడా కుప్పకూల్చిన టీమిండియా బౌలర్లు

Team India bundled out South Africa for 83 runs
  • నేడు కోల్ కతాలో టీమిండియా × దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన
  • 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు
  • లక్ష్యఛేదనలో 27.1 ఓవర్లలో 83 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్
  • 243 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘనవిజయం

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా, కుప్పకూల్చడమే లక్ష్యంగా దూసుకెళుతున్న రోహిత్ సేన ఖాతాలో వరుసగా 8వ విజయం చేరింది. ఇవాళ కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో దక్షిణాఫ్రికాను అన్ని రంగాల్లో చిత్తు చేసిన టీమిండియా 243 పరుగుల భారీ తేడాతో జయకేతనం ఎగురవేసింది. 

టీమిండియా బౌలర్లు అంటేనే ప్రత్యర్థి జట్లు హడలిపోయేలా మనవాళ్ల ప్రదర్శన కొనసాగుతోంది. ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాటింగ్ లైనప్ అయినా టీమిండియా బౌలర్లకు ఎదురొడ్డి నిలిచే పరిస్థితి కనిపించడంలేదు. 327 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సఫారీలు 27.1 ఓవర్లలో 83 పరుగులకే చేతులెత్తేశారు. 

ఇప్పటిదాకా పేస్ తో కొట్టిన టీమిండియా నేటి మ్యాచ్ లో స్పిన్ అస్త్రాలను ప్రయోగించి దక్షిణాఫ్రికా పనిబట్టింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో రాణించిన తీరు అమోఘం. మరోవైపు కుల్దీప్ యాదవ్ తనవంతుగా రెండు వికెట్లు పడగొట్టి సఫారీ ఇన్నింగ్స్ కు తెరదించాడు. మహ్మద్ షమీ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. 

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో మార్కో యన్సెన్ 14, వాన్ డర్ డుస్సెన్ 13, డేవిడ్ మిల్లర్ 11, కెప్టెన్ టెంబా బవుమా 11 పరుగులు చేశారు. క్వింటన్ డికాక్ (5), మార్ క్రమ్ (9), క్లాసెన్ (1) విఫలమయ్యారు. టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ను ఈ నెల 12న నెదర్లాండ్స్ తో ఆడనుంది.

టీమిండియా ఇప్పటికే సెమీస్ చేరిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో టీమిండియా 8 మ్యాచ్ ల్లో 8 విజయాలతో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. దాంతో తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆడడం దాదాపు ఖాయమైంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో టీమిండియా సెమీస్ ఆడే అవకాశాలున్నాయి. వరల్డ్ కప్ లో తొలి సెమీఫైనల్ నవంబరు 15న జరగనుంది.

  • Loading...

More Telugu News