New Delhi: ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మనవే!

Three Indian Cities Among Worlds Polluted
  • టాప్-10లో మూడు నగరాలు మనవే
  • అగ్రస్థానంలో ఢిల్లీ, కోల్‌కతా  మూడు, ముంబై ఆరో స్థానంలో
  • ఢిల్లీలో దారుణ పరిస్థితులు
  • అక్కడ ఏ సమయంలో చూసినా ఏక్యూఐ 400-500 
  • ఉక్కిరిబిక్కిరి అవుతున్న 2 కోట్ల మంది

ప్రపంచంలోని అత్యంత కాలుష్యకారక నగరాల్లో మూడు మన దేశంలోనే ఉన్నాయి. కాలుష్యం కారణంగా గాలిలో నాణ్యత పడిపోయి నిత్యం అల్లాడిపోయే దేశ రాజధాని ఢిల్లీతోపాటు కోల్‌కతా, ముంబై కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు స్విస్ గ్రూప్ ‘ఐక్యూ ఎయిర్’ నివేదిక వెల్లడించింది. అంతేకాదు, ఈ జాబితాలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో రియల్ టైం గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్) ఈ ఉదయం 7.30 గంటలకు ఏక్యూఐ 483గా ఉంది. 

రెండో స్థానంలో పాకిస్థాన్‌లోని లాహోర్ (371) ఉండగా, కోల్‌కతా (206) మూడో స్థానంలో, ముంబై (162) ఆరో స్థానంలోను ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (189), పాకిస్థాన్‌లోని కరాచీ (162) నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి. చైనాలోని షెన్యాంగ్ (159), హాంగ్జౌ (159), కువైట్‌లోని కువైట్ సిటీ (155), చైనాలోని వుహాన్ (152) వరుసగా 7, 8, 9, 10 స్థానాల్లో నిలిచాయి.

ఢిల్లీలో ఎందుకిలా?
అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలులు సరిగా లేకపోవడం, సమీప రాష్ట్రాల్లో పొలాల్లోని గడ్డి (పంటపొట్టు) తగలబెట్టడం వంటి కారణాలతో గాలి కలుషితం అవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని కొన్ని స్టేషన్లలో గాలి నాణ్యత ఏక్యూఐ 550కి చేరుకోవడంతో రెండు కోట్ల మంది ప్రజలు కంటి, గొంతు సమస్యలతో బాధపడుతున్నారు.

ఏక్యూఐ 0-50గా ఉంటే గాలి నాణ్యంగా ఉన్నట్టు భావిస్తారు. కానీ, అది అక్కడ ఏ సమయంలో చూసినా 400-500గా ఉండడంతో ఆరోగ్యవంతులు అనారోగ్యం బారినపడుతుండగా, ఇప్పటికే వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది.

  • Loading...

More Telugu News