Mukesh Ambani: ముఖేశ్ అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపిన తెలంగాణ విద్యార్థి అరెస్ట్

Police arrest Telangana student who threatened Mukesh Ambani
  • గత కొన్నిరోజులుగా ముఖేశ్ అంబానీకి బెదిరింపులు
  • రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ వార్నింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబానీ భద్రతా సిబ్బంది
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి గత కొన్ని రోజులుగా బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. రూ.400 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని అంబానీకి బెదిరింపు మెయిళ్లు పంపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ బెదిరింపులపై ముఖేశ్ అంబానీ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ బెదిరింపు మెయిళ్ల వెనుక ఉన్నది తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేశారు. ఆ విద్యార్థి పేరు వనపర్తి గణేశ్. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గణేశ్ ఆచూకీని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ముంబయికి తరలించారు. కోర్టులో హాజరుపర్చగా, నవంబరు 8 వరకు కస్టడీ విధించారు. 

దీనిపై పోలీసులు స్పందిస్తూ... గణేశ్ ఓ విద్యార్థి అని, ఈ బెదిరింపుల వెనుక అతడి ఉద్దేశం ఏమిటన్నదానిపై ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించారు. అక్టోబరు 27 నుంచి నవంబరు 1 మధ్యన అనేక బెదిరింపు ఈ-మెయిళ్లు పంపాడని తెలిపారు. 

గణేశ్ బెదిరింపు మెయిళ్లు పంపడానికి వీపీఎన్ (వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్) పరిజ్ఞానాన్ని వినియోగించాడని, మొదట ఆ మెయిళ్లు బెల్జియం నుంచి వచ్చినట్టుగా భావించామని, లోతుగా పరిశోధిస్తే ఆ మెయిళ్లు పంపింది తెలంగాణ విద్యార్థి అని గుర్తించామని పోలీసులు వివరించారు. తొలుత రూ.20 కోట్లు డిమాండ్ చేసిన గణేశ్ చివరికి రూ.400 కోట్లకు పెంచాడని తెలిపారు.
Mukesh Ambani
Threat Mail
Ganesh Vanaparthi
Police
Mumbai
Telangana

More Telugu News