Ch Malla Reddy: రేవంత్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర విమర్శలు

Minister Mallareddy comments on Revanth Reddy and Hanmantharao
  • రేవంత్ రెడ్డి సీఎం కావాలని పగటి కలలు కంటున్నారన్న  మల్లారెడ్డి 
  • ఎవరిని గెలిపించాలో ప్రజలకు తెలుసునని వ్యాఖ్య
  • మల్కాజిగిరికి ఏం చేయని వాడు... ముఖ్యమంత్రి అయితే ఏం ఉద్దరిస్తాడు? అని ప్రశ్న
  • మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడి... ఆయన గెలిచేది లేదు చేసేది లేదన్న మల్లారెడ్డి 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, కానీ ఎవరిని గెలిపించాలో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో మీడియాతో మాట్లాడుతూ... లోక్ సభ సభ్యుడిగా మల్కాజిగిరి నియోజకవర్గానికి టీపీసీసీ అధినేత ఏం చేశారు? అని ప్రశ్నించారు. కనీసం ఒక్కపైసా ఖర్చు పెట్టలేదన్నారు. అలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని ఏం ఉద్దరిస్తాడు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటూ అప్పుడే మంత్రి పదవులు పంచుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

మైనంపల్లి హన్మంతరావు ఓ రౌడీ అని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి గెంటేస్తే కాంగ్రెస్‌లోకి వెళ్లి పోటీ చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాక ఆయన పిచ్చోడు అయ్యాడన్నారు. మైనంపల్లి మళ్లీ గెలిచేది లేదు.. ఆయన చేసేది లేదన్నారు. దేశానికి అన్నంపేట్టే స్థాయికి తెలంగాణ ఇప్పుడు ఎదిగిందన్నారు. బస్తీ దవాఖానాలతో అందరికీ వైద్యం అందుతోందన్నారు. ప్రయివేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయన్నారు. ఐటీ రంగం కూడా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. కాంగ్రెస్ అంటే స్కాం.. కేసీఆర్ అంటే అభివృద్ధి అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మాయమాటలు చెబుతుందని, వారి పాలనలో కరెంట్ కోతలతో పరిశ్రమలు మూతబడ్డాయన్నారు.

కేసీఆర్ పాలనలో కులవృత్తులవారు మురిసిపోతున్నారన్నారు. అంతకుముందు వానలు పడాలని మొక్కేదని, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తాను వానలు చాలని వరుణదేవుడికి మొక్కానన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్ అన్నారు. రాహుల్ గాంధీ పుట్టినప్పటి నుంచి దాదాపు కాంగ్రెస్సే పాలించిందని, అంటే ఆయన పుట్టినప్పటి నుంచి అన్నీ కుంభకోణాలే అన్నారు. వారు చేసిన అభివృద్ధి ఏమిటన్నారు. దేశాన్ని వారు దరిద్రం చేసి వెళ్లారన్నారు. ముస్లీంలు, దళితులను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుందని ఆరోపించారు. కానీ మళ్లీ కాంగ్రెస్ మాయమాటలు చెబుతోందన్నారు.

  • Loading...

More Telugu News