Telangana: తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఖరారు

  • 9 సీట్లను జనసేనకు కేటాయించిన బీజేపీ
  • కూకట్ పల్లి సహా గ్రేటర్ లో మరో స్థానంలోనూ జనసేన పోటీ
  • మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ
BJP Jana Sena Alliance Finalized With 9 Seats Allotted To JSP Including In Greater Hyderabad

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తెలంగాణలో 9 సీట్లను జనసేనకు కేటాయించినట్లు సమాచారం. ఇందులో గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి కూడా ఉందని, దీంతోపాటు మరో చోట కూడా జనసేన అభ్యర్థిని బరిలోకి దించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక రాష్ట్రంలో మిగతా సీట్లలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసింది. 

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై తెలంగాణ నేతలతో జనసేనాని పలుమార్లు చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా 30 చోట్ల బరిలోకి దిగాల్సిందేనని నాయకులు పట్టుబట్టారు. ఆ దిశగా నాయకులు చేసిన ప్రతిపాదనపై పవన్ కల్యాణ్ పరిశీలన జరిపారు. తాజాగా బీజేపీతో పొత్తు కుదరడంతో తెలంగాణలోని ఆ తొమ్మిది సీట్లలో మాత్రమే పోటీ చేయాలని, మిగతా చోట్ల బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ నిర్ణయించింది. కాగా, జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్న స్థానాలు ఇవే.. కూకట్‌పల్లితో పాటు గ్రేటర్ లో మరో సీటు, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట, కొత్తగూడెం, కోదాడ, నాగర్‌కర్నూల్, తాండూరు.

More Telugu News