Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడంపై సజ్జల ఏమన్నారంటే...!

Sajjala talks about Sharmila statement on supporting Congress party in Telangana Assembly elections
  • తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రకటించిన షర్మిల
  • ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని వెల్లడి
  • ఇది ఏపీకి సంబంధించిన విషయం కాదన్న సజ్జల
  • దీనిపై షర్మిలను అడిగితేనే బాగుంటుందని వ్యాఖ్యలు
  • తమకు ఏపీ విషయాలే ముఖ్యమని స్పష్టీకరణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. ఆమె ఢిల్లీ వెళితే చాలు... కాంగ్రెస్ పార్టీలో చేరడానికేనంటూ కథనాలు వచ్చేవి. ఇక అసలు విషయానికొస్తే, షర్మిల తాజాగా వైఎస్సార్టీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని స్పష్టం చేశారు. 

దీనిపై స్పందించాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మీడియా కోరింది. జగన్ మోహన్ రెడ్డి ఏ పార్టీపై అయితే పోరాడారో ఇప్పుడు ఆ పార్టీలోనే షర్మిల చేరిందని, అందుకు మీరేమంటారని సజ్జలను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. 

అందుకు సజ్జల బదులిస్తూ, తమ వైఖరి వెల్లడించారు. "జగన్ మోహన్ రెడ్డి ఏ పార్టీ మీదా ఫైట్ చేయలేదు. ఏ పార్టీ అయితే చంద్రబాబుతో కలిసి జగన్ ను విపరీతంగా వేధించి అక్రమ కేసులు పెట్టిందో, ఆ పార్టీలో షర్మిలమ్మ గారు చేరారు. 

ఆమె తెలంగాణలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలు. మేం ఇంతకుముందే చెప్పాం... ఇప్పుడూ అదే చెబుతున్నాం... షర్మిల ఎప్పుడయితే పార్టీ పెట్టారో, తన పార్టీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, విధానాలకు సమాధానం చెప్పేందుకు ఆమె మాత్రమే సరైన వ్యక్తి అవుతుంది. ఏదైనా అడగాల్సి ఉన్నా ఆమెనే అడగాలి. 

మాకు, జగన్ గారికి ఏపీ మాత్రమే ముఖ్యం. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర వ్యవహారాలే మాకు ముఖ్యం. ఈ రాష్ట్రంలో ప్రత్యర్థులు, వాళ్లు చేసే కుట్రలను ఎదుర్కోవడం ఎట్లా అనేదే మాకు ముఖ్యం. 

షర్మిల గురించే కాదు, పొరుగు రాష్ట్రంలోని ఎవరి గురించి కూడా మేం కామెంట్ చేయడంలేదు... ఈ విషయం మీరు (మీడియా) గమనించే ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి గారు అసలు ఇలాంటి విషయాలే మాట్లాడరు. మా దృష్టంతా ఏపీ పైనే" అని సజ్జల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News