Raghu Rama Krishna Raju: వైసీపీ పాలనలో అవినీతి జరిగిందంటూ హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిల్

Raghurama approaches high court seeking CBI probe on YCP administrtion
  • సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న రఘురామ
  • ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో పిటిషన్ లో వివరణ
  • సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టుకు విజ్ఞప్తి 
వైసీపీ నాలుగున్నరేళ్ల పాలన అవినీతిమయం అని ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పై ఉన్న కేసుల విషయం తేల్చాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన రఘురామ... తాజాగా, వైసీపీ పాలనలో చోటుచేసుకున్న అవినీతి నిగ్గు తేల్చాలని ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. 

సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆరోపించారు. ఈ మేరకు ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందన్న విషయాన్ని రఘురామ వివరంగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

ప్రజాధనానికి నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వివరించారు. సాక్షి పత్రిక, సాక్షి చానల్ కు లబ్ది కలిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. సీఎస్ సహా పలువురు ఐఏఎస్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని కూడా రఘురామ తన పిటిషన్ లో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

మొత్తం 1,311 పేజీలతో రఘురామ న్యాయవాది ఉన్నం మురళీధర్ సుదీర్ఘ పిటిషన్ దాఖలు చేశారు. మద్యం ఇసుక, అంబులెన్స్ ల కొనుగోళ్లలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోర్టులను అనుచరులకు కట్టబెట్టే క్రమంలో భారీ అవినీతికి పాల్పడ్డారని వివరించారు. టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఇసుక కుంభకోణానికి పాల్పడ్డారని ఆ పిటిషన్ లో తెలిపారు. 

పేదలందరికీ ఇళ్లు అనే పథకం ద్వారా ప్రైవేటు వ్యక్తుల స్థలాలను కొనుగోలు చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని వెల్లడించారు. ఎక్సైజ్ పాలసీని మార్చి భారీ ఎత్తున మద్యం అక్రమాలకు పాల్పడ్డారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. భారతీ సిమెంట్స్ కు కూడా లబ్ది కలిగేలా వ్యవహరించారని, ప్రభుత్వానికి సరఫరా చేసే సిమెంట్ రెడ్ బ్యాగ్ లలో ఇవ్వాలని నిబంధన విధించిన అంశాన్ని కూడా పిటిషన్ లో ప్రస్తావించారు. అన్ని సిమెంట్ కంపెనీలు ఇక్కడే భారతీ పాలిమర్స్ నుంచి రెడ్ బ్యాగ్ లు కొనుగోలు చేయాలని నిబంధన విధించినట్టు వివరించారు. 

సీఎం, మంత్రివర్గం, పలువురు సీనియర్ అధికారులతో సహా మొత్తం 41 మందిని ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. పెద్దిరెడ్డి, సజ్జల, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డిలను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. రఘురామ పిల్ ను స్వీకరించిన ఏపీ హైకోర్టు... ఆ పిల్ కు నెంబరు కేటాయించింది.
Raghu Rama Krishna Raju
PIL
AP High Court
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News