Cricket: ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌కు ముందు ఊరిస్తున్న రికార్డులు ఇవే!..

These are the records that are being set before the India vs Sri Lanka match
  • సచిన్ పేరిట వున్న రెండు రికార్డులపై కోహ్లీ కన్ను 
  • పలువురు భారత్, శ్రీలంక ఆటగాళ్లు ప్రత్యేక మైలురాళ్లు సాధించే అవకాశం
  • లంకపై గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు
మరికొన్ని గంటల్లో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో భారత్ తలపడబోతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే ఈ వరల్డ్ కప్‌లో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్తుంది. వరల్డ్ కప్‌లో వరుసగా 7 గెలుపుల ద్వారా రికార్డు సృష్టించనుంది. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు కూడా ఊరిస్తున్నాయి. మరి ఆ రికార్డులు ఏంటో పరిశీలిద్దాం..

1. వన్డేల్లో 49 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేసే అవకాశాలున్నాయి. కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 48 సెంచరీలు ఉన్నాయి.

2. ఒక క్యాలెండర్ ఏడాదిలో 1000 పరుగులు ఎక్కువసార్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం విరాట్, సచిన్ టెండూల్కర్‌ సమానంగా ఉన్నారు. ఇద్దరూ ఏడు సార్లు ఒకే ఏడాది వెయ్యి పరుగులు చేశారు. సచిన్ ను అధిగమించేందుకు కోహ్లీ కేవలం 34 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో 34 పరుగులు కొడితే సచిన్ రికార్డ్ బద్ధలుకానుంది.

3. శ్రేయాస్ అయ్యర్ తన తదుపరి మూడు మ్యాచ్‌ల్లో 65 పరుగులు చేస్తే ఏడాదిలో వెయ్యి పరుగులు చేసిన మూడవ వేగవంతమైన భారతీయ క్రికెటర్‌గా నిలుస్తాడు.

4. శ్రీలంక బౌలర్ మాథ్యూస్, రోహిత్ శర్మను వన్డేల్లో ఇప్పటివరకు ఏడుసార్లు అవుట్ చేశాడు. రోహిత్‌ను అందరి కంటే ఎక్కువసార్లు ఔట్ చేసింది ఈ బౌలరే కావడం విశేషం. ఇందులో 2 డకౌట్స్ కూడా ఉన్నాయి. మాథ్యూస్‌పై రోహిత్ సగటు 14.71 కాగా, స్ట్రైక్ రేట్ 58.85 చాలా తక్కువగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ను మాథ్యూస్ ఔట్ చేస్తే గణాంకాలు మరింత పేలవంగా మారతాయి.

5. శ్రీలంక బ్యాట్స్‌మెన్ సమరవిక్రమ 1000 వన్డే పరుగులకు 54 పరుగుల దూరంలో ఉన్నాడు. గురువారం ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది. రాయ్ డయాస్‌తో (27 ఇన్నింగ్స్‌లు) సమానంగా వేగంగా 1000 పరుగులు చేరుకున్న శ్రీలంక ఆటగాడిగా అవతరిస్తాడు.

6. మహేశ్ తీక్షణ వన్డేల్లో 50 వికెట్ల మైలురాయి చేరుకోవడానికి 3 వికెట్ల దూరంలో ఉన్నాడు.
Cricket
Team India
BCCI
Sri Lanka

More Telugu News