janga raghavareddy: నాకు టిక్కెట్ ఇవ్వకుంటే... కచ్చితంగా పోటీ చేస్తా: కాంగ్రెస్‌కు జంగా రాఘవరెడ్డి అల్టిమేటం

Janga Raghava Reddy ultimatum to congress
  • తనకు టిక్కెట్ ఇవ్వడంపై అధిష్ఠానం పునరాలోచన చేయాలన్న జంగా రాఘవరెడ్డి
  • ఇండిపెండెంట్‌గా లేదా ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తానని వెల్లడి
  • పార్టీని మోసం చేసే వారికి టిక్కెట్ ఇస్తే గెలవరని వ్యాఖ్య
వరంగల్ వెస్ట్ టిక్కెట్ ఆశించి భంగపడిన కాంగ్రెస్ పార్టీ నేత జంగా రాఘవరెడ్డి అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా పునరాలోచన చేయాలని, తనకు టిక్కెట్ ఇవ్వకుంటే అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కూడా గెలిచే సత్తా తనకు ఉందన్నారు. తాను మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నానన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన వ్యక్తికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం దారుణమన్నారు.

పార్టీ టికెట్ వచ్చిన అభ్యర్థి... బీజేపీ తొత్తు అని ఆరోపించారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఆదుకున్న వారికే టికెట్ ఇస్తామని పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారని, కానీ పార్టీని, ప్రజలను మోసం చేసే వారికి టిక్కెట్ ఇస్తే గెలవరన్నారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికైనా తనకు టిక్కెట్ ఇవ్వడంపై పునరాలోచన చేయాలన్నారు. లేదంటే తాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేస్తానన్నారు.
janga raghavareddy
Congress
BJP
Telangana Assembly Election

More Telugu News