Revanth Reddy: హైకమాండ్ సూచన మేరకు కోదండరాం మద్దతు కోరాం: రేవంత్ రెడ్డి

  • కోదండరాంతో భేటీ అయిన రేవంత్, ఠాక్రే, బోస్ రాజు
  • బీఆర్ఎస్ అవినీతిపై పదేళ్ళుగా కోదండరాం పోరాటం చేస్తున్నారన్న రేవంత్ రెడ్డి
  • నియంతను గద్దె దించడమే ప్రధాన అజెండాగా పని చేస్తామని వెల్లడి
  • వచ్చేది ప్రజల ప్రభుత్వం.... కాంగ్రెస్ ప్రభుత్వమన్న ఠాక్రే
Revanth Reddy meets Kodandaram

నియంతను గద్దె దించడానికి కాంగ్రెస్, తెలంగాణ జన సమితి కలిసి ముందుకు సాగుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రేవంత్, ఠాక్రే, బోస్ రాజు సహా పలువురు కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాంతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తమ పార్టీ అధిష్ఠానం సూచన మేరకు కోదండరాంను కలిశామన్నారు. రెండు పార్టీల అవగాహన పత్రం విడుదల చేస్తామన్నారు. పార్టీల సమన్వయం కోసం ఓ కమిటీని వేస్తామన్నారు. తమ లక్ష్యం గొప్పదని, దాని కోసం కలిసి పని చేస్తామన్నారు.

బీఆర్ఎస్ అవినీతిపై పదేళ్లుగా కోదండరాం పోరాటం చేస్తున్నారన్నారు. నియంతను గద్దె దించడమే తమ ప్రధాన అజెండా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కోదండరాం మద్దతు కోరినట్లు తెలిపారు. కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలని కోరామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ జన సమితిని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని వెల్లడించారు.

వచ్చేది ప్రజల ప్రభుత్వమని... కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఠాక్రే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చినందుకు కోదండరాంకు ధన్యవాదాలు తెలిపారు. కోదండరాం, రేవంత్ రెడ్డిలు కలిసి సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్తారన్నారు.

More Telugu News