Rail Accident: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య

Death toll increase to 14 in vizjanagram rail accident
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • వందల సంఖ్యలో క్షతగాత్రులు
  • అర్ధరాత్రి వరకు 10 మృతదేహాల వెలికితీత
  • రాయగడ రైలులోని లోకోపైలట్లు ఇద్దరూ మృతి

విజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్న విశాఖపట్టణం-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి.

రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్న పలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది.

రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరినాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఎస్ఆర్ పురానికి చెందిన గిడిజాల లక్ష్మి (40)గా గుర్తించారు. అలాగే, పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News