Australia: 389 పరుగుల ఛేజింగ్ లో ఆసీస్ ను చివరి బంతి వరకు వణికించి.. ఓడిన న్యూజిలాండ్!

  • వరల్డ్ కప్ లో ఆసీస్ వర్సెస్ కివీస్
  • ఆఖరు బంతి వరకు హోరాహోరీగా మ్యాచ్
  • 389 పరుగుల ఛేజింగ్ లో 383 పరుగులు చేసిన కివీస్
  • 5 పరుగుల తేడాతో గట్టెక్కిన ఆసీస్
  • రచిన్ రవీంద్ర అద్భుత సెంచరీ
Aussies win the thriller by 5 runs as New Zealand earned audience applause

ధర్మశాలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో పరుగులు వరదలా పొంగిపొర్లాయి. భారీ స్కోర్లు నమోదైన ఈ హోరాహోరీ సమరంలో ఆసీస్ 5 పరుగుల తేడాతో గెలిచింది. 

ఆసీస్ గెలిచింది అనడం కంటే గట్టెక్కింది అంటేనే బాగుంటుందేమో! ఎందుకంటే... కివీస్ 389 పరుగుల లక్ష్యఛేదనలో ఆసీస్ ను చివరి బంతి వరకు వణికించింది. ఆఖరికి 50 ఓవర్లలో 9 వికెట్లకు 383 పరుగులు చేసి త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. ఆఖరికి 6 పరుగులు కొడితే విజయం వరిస్తుందనగా, బౌల్ట్ నేరుగా ఫీల్డర్ వద్దకు బంతిని కొట్టడంతో ఓటమి తప్పలేదు. 

అసలు, 389 పరుగుల టార్గెట్ అంటే... ఎంత పెద్ద జట్టయినా కాస్తంత భయపడుతుంది. కానీ, న్యూజిలాండ్ జట్టు పూర్తిగా పాజిటివ్ దృక్పథంతో బ్యాటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

కివీస్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే రచిన్ రవీంద్ర సెంచరీనే. అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేదు... ఆడుతుందేమో వరల్డ్ కప్ లో... అయినప్పటికీ, ఆ బెరుకు అనేదే లేకుండా రచిన్ రవీంద్ర స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన తీరు అతడు న్యూజిలాండ్ జట్టుకు భవిష్యత్ సూపర్ స్టార్ ఆటగాడు అని చాటుతోంది. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ, ఏకాగ్రత చెడకుండా ఆడిన రవీంద్ర కేవలం 89 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 116 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్ లో అతడికిది రెండో సెంచరీ. 

రవీంద్ర క్రీజులో ఉన్నంత సేపు న్యూజిలాండ్ జట్టు విజయంపై ధీమాతో ఉంది. అంతకుముందు, డెవాన్ కాన్వే (28), విల్ యంగ్ (32) తొలి వికెట్ కు 61 పరుగులు జోడించి ఓ మోస్తరు పునాది వేశారు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్ (54) జోడీ భారీ భాగస్వామ్యంతో మ్యాచ్ ను ఆసీస్ కు దూరం చేస్తున్నట్టే కనిపించింది. మిచెల్ అవుటైనప్పటికీ రవీంద్ర తన విజృంభణ కొనసాగించాడు. కీలక దశలో బంతిని అందుకున్న ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్... ప్రమాదకర రవీంద్రను అవుట్ చేసి ఆసీస్ శిబిరంలో ఆశలు నింపాడు. 

అయితే, కివీస్ ఆల్ రౌండర్ జిమ్మీ నీషామ్ భారీ షాట్లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చివేశాడు. నీషామ్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 58 పరుగులు చేసి 9వ వికెట్ రూపంలో వెనుదిరిగాడు. నీషామ్ క్రీజులో ఉన్నంత సేపు ఆసీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయంటే అతిశయోక్తి కాదు. చివర్లో ఆసీస్ ఫీల్డర్లు కొన్ని బౌండరీలను అద్భుతంగా ఆపి కివీస్ విజయాన్ని అడ్డుకున్నారు. రెండు బంతుల్లో 7 పరుగులు తీయాల్సిన దశలో నీషామ్ రనౌట్ కావడం కివీస్ కు గుండె పగిలినంత పనైంది. 

కాగా, ఈ విజయంతో ఆసీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఓ దశలో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఆసీస్ వరుస విజయాలతో దూసుకురావడం విశేషం.

More Telugu News