Bandi Sanjay: శ్రీశైలం గౌడ్ పై దాడిన ఖండించిన బండి సంజయ్

  • శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన వివేకానంద 
  • సమస్యలపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా అని బండి సంజయ్ మండిపాటు
  • వివేకానంద గౌడ్ ను ఓడించాలని ప్రజలకు విన్నపం
Bandi Sanjay condemns attack on Srisailam Goud

ఒక వార్తా ఛానల్ లో డిబేట్ సందర్భంగా బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జీడిమెట్లలో ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలో జీడిమెట్ల షాపూర్ లోని శ్రీశైలం గౌడ్ ఇంటికి బీజేపీ కీలక నేత బండి సంజయ్ వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ... మందు తాగి వచ్చి గొడవకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? లేక కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా? అని ప్రశ్నించారు. శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన ఎమ్మెల్యే పేరుకే వివేకానంద అని... బుద్ధులు మాత్రం ఔరంగ జేబ్ వి అని విమర్శించారు. 


అక్రమంగా సంపాదించిన డబ్బులతో గెలుస్తానని వివేకానంద అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రజల సమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఎలాంటి దాడులనైనా బీజేపీ భరిస్తుందని చెప్పారు. కండకావరంతో దాడి చేసిన వివేకానంద్ గౌడ్ ను ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని కోరారు. కబ్జాలకు పాల్పడే వారిని ఎన్నికల్లో బహిష్కరించాలని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News